Aadhaar Camps: ఏపీ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు అందుబాటులో క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపటి నుంచి (నవంబర్ 17 నుంచి 26వ తేదీ ) వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ కార్డు క్యాంపులు నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు మూడు రోజుల క్రితం లేఖ రాశారు. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులు ఆధార్ వివరానలు సరిచేసుకోవడంతోపాటు బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన అవకాశం కల్పించింది. నవంబర్ 17 నుంచి 26 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ–యూఐడీఏఐ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ క్యాంపుల్లో విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది పిల్లలు తమ ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉన్నట్లు యూఐడీఏఐ గుర్తించింది. అదే కారణంగా, గ్రామ–వార్డు సచివాలయాల శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపారు.
5 నుండి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు పాఠశాల వద్దే తమ ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ వంటి వివరాలను అప్‌డేట్ చేయించుకోవచ్చు. ఈ సేవను ఒక్కసారి మాత్రమే ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికి ఆధార్ కార్డు ప్రతి రంగంలో తప్పనిసరి పత్రంగా మారింది. స్కూల్ అడ్మిషన్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అన్నింటికీ ఆధార్ అవసరం ఉంది. బాల ఆధార్ తీసుకున్న చిన్నారులకు ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలి. ఇది చేయకపోతే భవిష్యత్తులో పథకాల లబ్ధి లేదా ఇతర సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
అక్టోబర్ 1 నుంచి ఆధార్ సేవల ఛార్జీలు పెరగడంతో, ఇప్పుడు పేరు, పుట్టిన తేది వంటి వివరాల మార్పులకు రూ. 75 వసూలు చేస్తున్నారు. బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ఫీజు రూ. 100 నుంచి రూ. 125కు పెరిగింది. అయితే 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ మాత్రం పూర్తిగా ఉచితం. పుట్టిన కొత్త శిశువులకు ఆధార్ జారీ చేయడం కూడా ఎలాంటి చార్జీలు లేకుండానే జరుగుతుంది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ క్యాంపుల ద్వారా తమ పిల్లల ఆధార్ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయాలని అధికారులు తల్లిదండ్రులను కోరుతున్నారు.