Anupama Parameswaran Police Complaint: అందం, అభినయంతో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే అనుపమపై, తన కుటుంబంపై.. కావాలని ఒక సోషల్ మీడియా అకౌంట్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని.. తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తుందని సైబర్ పోలీసులకు ఇటీవల కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆ అకౌంట్ వెనక ఉన్నవాళ్లను పట్టుకున్నారు. ఈ ఘటనపై అనుపమ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. అది వైరల్‌గా మారింది.
అనుపమ పరమేశ్వరన్ చేసిన పోస్ట్‌లో కొన్ని రోజుల క్రితం ఒక ఇన్‌స్టా ప్రొఫైల్ నా గురించి, నా కుటుంబం గురించి చాలా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తుందని.. నా ఫ్రెండ్స్, కో యాక్టర్స్‌ను ట్యాగ్ చేసి ఆ పోస్టులు పెడుతున్నారని నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌లలో మార్ఫింగ్ చేసిన నా ఫొటోలు, నిరాధారమైన ఆరోపణలు కూడా ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఇలా వేధింపులు చేయటం చాలా బాధాకరం. నాకు సంబంధించిన ప్రతి పోస్ట్‌పై హానికరమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏకైక ఉద్దేశ్యంతో.. ఒక వ్యక్తి అనేక ఫేక్ అకౌంట్స్‌ను సృష్టించాడని విచారణలో తేలింది. దీని గురించి తెలుసుకున్న వెంటనే నేను కేరళలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.
వాళ్లు ఫాస్ట్‌గా స్పందించి ఇలా చేస్తున్న వ్యక్తిని గుర్తించారు. ఆశ్చర్యకరంగా అది తమిళనాడుకు చెందిన ఒక 20 ఏళ్ల అమ్మాయి అని తేలింది. ఆమె చిన్న వయస్సును దృష్టిలో ఉంచుకుని.. ఆమె భవిష్యత్తును, మనశ్శాంతి గురించి ఆలోచించి నేను ఆమె వివరాలను వెల్లడించకూడదని నిర్ణయించుకున్నాను.
ఈ సంఘటనతో ఒక విషయం మాత్రం చెప్పదలచుకున్నాను. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఇతరులపై వేధించే, పరువు తీసే, ద్వేషాన్ని వ్యాప్తి చేసే హక్కు ఎవరికీ ఉండదు అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.
దీనిపైన మేము చట్టపరమైన చర్య తీసుకున్నాము.. వాళ్లు చేసిన చర్యలకు పరిణామాలను ఎదుర్కొంటారు. సైబర్ బెదిరింపు శిక్షార్హమైన నేరం అని తన పోస్టులో అనుపమ పరమేశ్వరన్ చెప్పింది.