Gold minings in India: బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. త్వరలోనే తులం 2 లక్షలు అయ్యే ఛాన్స్ ఉంది. అయితే దేశంలో బంగారం ఉత్పత్తి పరిమితంగా ఉన్నప్పటికీ.. దేశంలో బంగారం నిల్వలకు ఏ మాత్రం కొదవ లేదు. దేశంలో ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో బంగారు మైనింగ్స్ లో ఉత్పత్తి జరుగుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో త్వరలోనై బంగారం మైనింగ్స్ ప్రారంభం కానున్నాయి. దేశంలో ఎక్కడెక్కడ బంగారు నిల్వలు ఉన్నాయి.. ఎంత బంగారం ఉత్పత్తి చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెరగడమే తప్పా తగ్గడం లేదు. ప్రతిరోజూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భయాన్ని కలిగిస్తున్నాయి. అటు వెండి ధరలు కూడా ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. బంగారం ధరలు అయితే కొత్త శిఖరాలకు చేరుతున్నాయి. నేడు అక్టోబర్ 15వ తేదీ 10 తులాల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,000 దాటింది.
అయితే బంగారం ధర లక్షలు దాటినప్పటికీ దేశంలో బంగారం పట్ల ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. లక్షా అయినా రెండు లక్షలు అయినా గ్రాము బంగారమైనా కొనాల్సిందే అనుకునేవారు చాలా మంది ఉన్నారు. దేశంలో బంగారు గనులకు కూడా కొదవ లేదు. ఇప్పటికీ దేశంలో ఎన్నో ప్రాంతాల్లో బంగారు గనుల్లో ఉత్పత్తి ప్రారంభం అయ్యింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 నివేదిక ప్రకారం, దేశం మొత్తం 879.58 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇందులో 511.99 టన్నులు దేశీయంగా నిల్వ చేయగా.. దాదాపు 348.62 టన్నులు విదేశాలలో (బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి వాటి వద్ద) నిల్వ చేసి ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ బంగారం రేటు ఎక్కువగా ఉండటంతో ఈ బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. రూపాయి విలువ తగ్గడం కూడా దాని విలువను మరింత పెంచింది.
భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాలలో ఒకటి అయినప్పటికీ, బంగారం ఉత్పత్తిలో దాని వాటా చాలా తక్కువనే చెప్పాలి. దేశంలో కొన్ని చురుకైన బంగారు గనులు మాత్రమే ఉన్నాయి. వాటిలో అతిపెద్దది.. పురాతనమైనది కర్ణాటకలోని హుట్టి గోల్డ్ మైన్స్. రాయచూర్ జిల్లాలో ఉన్న ఈ గని ఏటా సుమారు 1,700 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదిన్నర కాలంలో ఉత్పత్తిని సంవత్సరానికి 5,000 కిలోలకు పెంచాలని యోచిస్తోంది. హుట్టి గోల్డ్ మైన్స్ కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారతదేశంలోని ఏకైక పెద్ద ఆపరేటింగ్ బంగారు మైనింగ్ యూనిట్ ఇది.
అదనంగా, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద బంగారు గని. కానీ అది 2001లో మూసివేశారు. ప్రభుత్వం ఇప్పుడు దాని పాత టైలింగ్‌ల నుండి (మైనింగ్ తర్వాత మిగిలిపోయిన శిథిలాల) బంగారాన్ని తీయడానికి ఒక కొత్త ప్రణాళికపై పని చేస్తోంది. KGF టైలింగ్‌లలో సుమారు 32 మిలియన్ టన్నుల పదార్థం ఉందని, అందులో ఇప్పటికీ బంగారం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాసెస్ చేస్తే, ప్రతి సంవత్సరం సుమారు 700 నుండి 750 కిలోల బంగారాన్ని తీయవచ్చు.
అంతేకాదు రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బంగారు గనులు త్వరలోనే తవ్వకం ప్రారంభించబోతున్నాయి. రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలోని భూఖియా-జగ్‌పురా బ్లాక్‌లో బంగారు నిక్షేపాలు గుర్తించారు. జార్ఖండ్‌లోని కుందర్‌కోచా ప్రాంతంలో కూడా పరిమిత బంగారు అన్వేషణ జరుగుతోంది. అటు ఏపీలోని కర్నూలు జిల్లాలో నవంబర్ నెలలో బంగారు ఉత్పత్తి ప్రారంభం కానుంది.