Gold Rate: బంగారం ధరలు.. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎత్తుకు చేరాయి. ప్రతి రోజూ పసిడి రేట్లు కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఒక్క ఔన్స్ బంగారం ధర ఇప్పటికే 4,000 అమెరికన్ డాలర్లను తాకింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయిగా నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పతాక స్థాయికి చేరాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1.25 లక్షలు పలుకుతోంది. ఈ పెరుగుదలతో సాధారణ వినియోగదారులు మాత్రమే కాదు, బంగారం ఆభరణాల వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
నగల షాపుల యజమానులు చెబుతున్నట్లు, బంగారం ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు షాపులకు వచ్చే సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి బంగారం ధర 10 గ్రాములకు రూ. 75,000 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది రూ. 1.25 లక్షల వరకు చేరింది. అంటే ఒక్క సంవత్సరంలోనే రూ. 50,000 వరకు పెరుగుదల నమోదయింది.
బంగారం ధరల ఈ పెరుగుదల వెనుక అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికన్ డాలర్ బలహీనత, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అంశాలు బంగారం విలువను మరింత ఎత్తుకు నడిపించాయి.
ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి, ఐదు సంవత్సరాల క్రితం రూ. 40,000 వద్ద ఉన్న ధరలు ఇప్పుడు మూడు రెట్లు పెరిగి రికార్డులు సృష్టిస్తున్నాయి.
ఇన్వెస్టర్లు కూడా పసిడిని “సేఫ్ హావెన్” (సురక్షిత పెట్టుబడి)గా భావిస్తున్నారు. అమెరికాకు చెందిన పలువురు ఆర్థిక నిపుణులు తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో కనీసం 15 శాతం బంగారం పెట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు.
అయితే, Bank of America తాజాగా విడుదల చేసిన నివేదికలో ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది. పెరుగుట అంటే ఒకరోజు విరుగుట అనేది సహజ చక్రం అని పేర్కొంటూ, బంగారం ధరలు ఇంత ఎత్తుకు చేరిన తర్వాత కొంత సమయానికే సవరణ (correction) రావచ్చని సూచించింది. బ్యాంక్ విశ్లేషకుల ప్రకారం, “Uptrend Exhaustion” దశలోకి మార్కెట్ ప్రవేశిస్తోందని, దీంతో వచ్చే త్రైమాసికం (Q4)లో ధరలు స్థిరంగా ఉండడం లేదా కొంత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇది బంగారం మీద పెట్టుబడులు పెట్టే వారికి జాగ్రత్త సూచనగా భావించవచ్చు. తాత్కాలికంగా ధరలు సర్దుబాటు కావచ్చని, దీర్ఘకాలంలో మాత్రం బంగారం స్థిరమైన విలువైన ఆస్తిగా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి, పసిడి ప్రస్తుతం పరాకాష్టను తాకుతున్నా, ఈ ఉత్సాహం ఎప్పటికీ కొనసాగదని Bank of America స్పష్టంగా సూచించింది. కాబట్టి ఇన్వెస్టర్లు అజాగ్రత్తగా పెట్టుబడులు పెట్టకుండా, జాగ్రత్తగా వ్యూహాలు రచించడం మంచిది.