Rohit Sharma and Virat Kohli Retirement News: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌పై అద్భుతంగా విజేతగా నిలవడంతో అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతారని రూమర్లు వినిపించగా.. అవన్నీ ఫేక్ అని తేలిపోయింది.
గత కొద్ది రోజులుగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించారు. అదే ఉత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి వచ్చారు.
ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో దుమ్ములేపగా.. రోహిత్ శర్మ ఫైనల్ పోరులో 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇప్పుడు అదే తరహాలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే ఇద్దరు వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది.
ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో తాను రిటైర్‌మెంట్ కావట్లేదని స్పష్టం చేశాడు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరింత కాలం వన్డేల్లో ఆడనున్నారు.
రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించకపోవడంతో యంగ్ ప్లేయర్లకు కొంత షాక్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా వన్డేల్లో స్థానం కోసం ఎదురుచూస్తున్న యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.
2027 వరల్డ్ కప్ వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీమిండియాకు ప్రపంచ కప్ అందించి రిటైర్ అవ్వాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు రిటైర్‌మెంట్ వార్తలపై ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అనవసరమైన రూమర్లు వద్దు.. థ్యాంక్స్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.