DA Hike Announced: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు కరవు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరవు ఉపశమనం (డీఆర్)లో 2 శాతం పెంపును మోదీ సర్కార్ ప్రకటించింది. దీంతో కేంద్ర ఉద్యోగుల డీఏ ఇప్పుడు 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వ ఉద్యోగులకు.. ఉగాది సందర్భంగా గుడ్ న్యూస్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం కరవు భత్యం (డీఏ), పెన్షనర్లకు కరవు ఉపశమనం (డీఆర్)లో 2 శాతం పెంపును ప్రకటించింది. ఇక దీంతో కేంద్ర ఉద్యోగుల డీఏ ఇప్పుడు 53 శాతం నుంచి ఏకంగా 55 శాతానికి పెరుగనుంది.
ఈ పెంపు జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. పెరిగిన డీఏ ఏప్రిల్ నెల జీతంలో మూడు నెలల బకాయిలు కలిపి జమ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించనుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 జనవరి 1 నుండి అమలులోకి రానున్న ఈ పెంపుతో, 48.66 లక్షల ఉద్యోగులు, 66.55 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. మొత్తం రూ. 6614.04 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది.
డియర్‌నెస్ అలవెన్స్ అంటే ధరల పెరుగుదల వల్ల ఉద్యోగులు పడే భారం తగ్గించేందుకు.. ప్రభుత్వం ఇచ్చే అదనపు ప్రయోజనం. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ ద్వారా కొత్త వేతనాలను నిర్ణయిస్తారు. అయితే, డీఏను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించి పెంచుతారు.
ఈ పెంపుతో ఉద్యోగుల వేతనం మరింత పెరగనుంది. పైగా, 8వ పే కమిషన్ రాబోతుండటంతో ఈ డీఏ పెంపు ఉద్యోగులకు మరింత ఆనందం కలిగిస్తోంది. కాగా ఇప్పటికే గతేడాది జూలైలో DA 50% నుంచి 53%కి పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ డీఏ పెంపు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ క్రమంలో భవిష్యత్తులో మరిన్ని వేతన మార్పుల కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.