Teachers Salary Issue: గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం మరోసారి తీవ్రంగా అవమానించింది. టీజీటీ, పీజీటీ వేతనాలను ఫ్లంబర్, ఎలక్ట్రీషియన్ల కంటే తక్కువగా నిర్ధారించడంతో తమను మరోసారి కించపరిచిందంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
1/7తెలంగాణ ప్రభుత్వం మరోసారి గురుకుల టీచర్లను నిరాశలోకి నెట్టింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో టీజీటీ, పీజీటీ టీచర్ల వేతనాన్ని కేవలం రూ.18,200గా నిర్ణయించడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనం రూ.19,500గా ఖరారు చేయడం టీచర్లను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది.
2/7ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రస్తుతం 268 గురుకులాలు ఉన్నాయి. వీటిలో ప్రాథమికం నుండి ఇంటర్‌వరకు బోధన కొనసాగుతోంది. మొత్తం 4,000 మందికి పైగా నాన్ రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో జూనియర్ లెక్చరర్లు, టీజీటీ, పీజీటీలు కూడా ఉన్నారు. గతంలో మైనార్టీ గురుకులాల్లో డ్రైవర్ కంటే తక్కువ జీతం నిర్ణయించి విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం, ఇప్పుడు అదే తప్పును మళ్లీ పునరావృతం చేసింది.
3/7కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి సంవత్సరం జూన్ నుండి ఏప్రిల్ వరకు సర్వీస్ రీన్యువల్ ఇవ్వడం పరిపాటిగా ఉన్నప్పటికీ, ఈసారి ప్రభుత్వం ఆలస్యం చేసింది. వేతనాలు నిలిచిపోయి నెలలుగా జీతాలు అందక బోధకులు ఇబ్బందులు పడుతున్నారు. నాన్‌రెగ్యులర్ సిబ్బంది నిరసనలకు దిగిన తర్వాతే ప్రభుత్వం సర్వీసులను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
4/7టీచర్లు వాదన ఏంటంటే. తాము రెగ్యులర్ టీచర్లలాగే బోధనతో పాటు కిచెన్ డ్యూటీలు, స్టడీ అవర్స్ పర్యవేక్షణ వంటి పనులు చేస్తున్నారు. కానీ నాన్-టీచింగ్ సిబ్బంది కంటే తక్కువ వేతనం ఇవ్వడం తీవ్ర అన్యాయం అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర గురుకుల సొసైటీల్లో నాన్‌రెగ్యులర్ టీచర్లకు రూ.24,000 చెల్లిస్తున్నారని వారు గుర్తుచేశారు.
5/7ఎన్నికల ముందు కాంగ్రెస్ పెద్దలు టీజీటీ, పీజీటీ టీచర్లకు కనీసం 12 నెలల జాబ్ సెక్యూరిటీ ఇస్తామని, జేఎల్‌లకు రూ.42 వేల జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ హామీలు మాటలుగానే మిగిలిపోయాయని టీచర్లు ఆరోపిస్తున్నారు.
6/7తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీ ఎంపవరింగ్ అసోసియేషన్ నాయకులు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హతలు కలిగిన లెక్చరర్లకు యూజీసీ పేస్కేల్ ఇవ్వాలని, 2019లో జారీ చేసిన జీవో 15ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాధారణ డిగ్రీ కళాశాలల్లో ఫ్యాకల్టీలతో సమాన అర్హతలున్నా, సమాన వేతనం ఇవ్వకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు.
7/7వేలాది గురుకుల టీచర్లు రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేయడం, వేతనాలు నెలల తరబడి ఆలస్యం చేయడం విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. గురుకుల టీచర్లకు సరైన గౌరవం, సముచిత వేతనం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు.