EPFO Latest News: ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి కంపెనీ మారిన ప్రతిసారి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాను కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్‌ను మరింత సులభతరం చేసింది. గతంలో కంపెనీ మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ బదిలీ చేసుకోవాలంటే ఆ కంపెనీ అనుమతి తప్పనిసరి అవసరం. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వివరాలు ఇలా..
ప్రావిడెంట్ ఫండ్ బదిలీలను సులభతరం చేసే ఉద్దేశంతో EPFO ఫారమ్ 13 లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు 1.25 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. చాలా బదిలీ కేసులలో కంపెనీ యజమాని ఆమోదం పొందాల్సిన అవసరాన్ని తొలగించింది.
PF ఖాతా నిర్వహణను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మీరు కొత్తగా చేరిన కంపెనీ ఆమోదం తెలిపితే.. ఆటోమేటిక్‌గా పాత కంపెనీ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ నిర్ణయంతో PF ట్రాన్స్‌ఫర్స్‌కు పట్టే సమయాన్ని బాగా తగ్గనుంది.
గతంలో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి సోర్స్, డెస్టినేషన్ EPFO కార్యాలయాల మధ్య సమన్వయం అవసరం ఉండేది. దీంతో చాలా సమయం పట్టేది. కొత్త నిబంధనల ప్రకారం.. సోర్స్ కార్యాలయం బదిలీ క్లెయిమ్‌ను ఆమోదించిన తర్వాత సభ్యుడి పాత PF ఖాతా డెస్టినేషన్ కార్యాలయంలో ఆటోమేటిక్‌గా విలీనం అవుతుంది. దీంతో ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గిపోతుంది.
అదేవిధంగా మరో కీలక మార్పు కూడా చేసింది. పీఎఫ్ సేవింగ్స్‌ను రెండు భాగాలుగా విభజించారు. మొదటిది పన్ను విధించదగినది. రెండోది పన్ను విధించనది. ఈ మార్పులో వడ్డీ ఆదాయాలపై కచ్చితమైన టీడీఎస్ తగ్గింపులను నిర్ధారించేందుకు ఉపయోగపడుతుంది.
అదనంగా ఈపీఎఫ్‌ఓ మరో ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది. ఉద్యోగులకు ఆధార్ సీడింగ్ అవసరం లేకుండానే బల్క్ జనరేషన్ యూనివర్సల్ అకౌంట్ నంబర్స్ (UAN)ను జనరేట్ చేయవచ్చు. ఇది కంపెనీ యజమానులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మోసాలను నివారించడానికి UAN లను ప్రారంభంలో స్తంభింపజేస్తారు. వీటిని ఆధార్‌తో లింక్ చేసిన తర్వాతే యాక్టివేట్ చేస్తారు.