IPO: స్టాక్ మార్కెట్లోకి మరో బ్లాక్ బస్టర్ ఐపీఓ.. తొలి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోన్న ఫ్లిప్ కార్ట్
FlipKart IPO: భారతదేశపు అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు రెడీ అవుతోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ రాబోయే 12-15 నెలల్లో దాని ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. $36 బిలియన్ల విలువ కలిగిన వాల్‌మార్ట్ యాజమాన్యంలో, కంపెనీ భారతదేశ "న్యూ ఎకానమీ" విభాగంలో అతిపెద్ద IPOని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది మరో బిగ్ ఐపీఓగా ఫ్లిప్ కార్ట్ నిలవబోతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
IPOకి ముందు తన ప్రధాన కార్యాలయం సింగపూర్ నుండి భారతదేశానికి మకాం మార్చుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ అంతర్గత అనుమతి తీసుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. FY2026 మొదటి త్రైమాసికం (Q1FY26) నాటికి లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నివేదిక ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ 2021 సంవత్సరం నుండి IPOని ప్రారంభించాలని యోచిస్తోంది. కానీ ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇది FY23 లో వాయిదా పడింది. అయితే ఈ మధ్యకాలంలో స్టార్టప్ ఐపీఓలు రాణిస్తుండటంతో ఫ్లిప్ కార్ట్ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
2025లోనే ఐపీఓ ఉండే అవకాశం ఉందని మరీ ఆలస్యమైతే 2026తొలి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జొమాటో, స్విగ్గీ, నైకా వంటి న్యూజనరేషన్ కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. వారి సరసన ఇప్పుడు ఫ్లిప్ కార్డు కూడా వచ్చి చేరనుంది.
ఫ్లిప్ కార్ట్ ను ఐఐటీ ఢిల్లీకి చెందిన విద్యార్థులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ 2007లో స్థాపించారు. దీన్ని 2018లో అమెరికాకు చెందిన వాల్ మార్ట్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేసింది. ఆ సంస్థకు 18శాతం వాటా ఉండగా..ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ గ్రూపునకు కల్యాణ క్రిష్ణమూర్తి సీఈవోగా వ్యవహారిస్తున్నారు.
2024 ఆర్థిక ఏడాదిలో రూ. 17,907 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది ఫ్లిప్ కార్ట్. రూ. 2,358 కోట్లనికరనష్టాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ హోల్డింగ్ కంపెనీ సింగపూర్ లో రిజిస్టర్ అయి ఉంది. సాధారణంగా టెక్నాలజీ ఆధారిత సంస్థలునియంత్రణ సంస్థల అనుమతులు, నిధుల సమీకరణ కోసం విదేశాల్లో తమ హోల్డింగ్ కంపెనీలను నెలకొల్పుతాయి. ఐపీఓ ప్రణాళికలు కలిగిన జెప్టో, మీషో, క్రెడిట్ బీ వంటి కంపెనీలు కూడా తమ హోల్డింగ్ సంస్థలను భారత్ కు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.