Gold Rate Today: అక్టోబర్ 9వ తేదీ గురువారం దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ప్రతి రోజు పసిడి ధరలు కొత్త ఎత్తులకు చేరుకుంటున్న సమయంలో, ఈ రోజు బంగారం రేట్లు మరొక సరికొత్త మైలురాయిని దాటాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,230, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,300 వద్ద ఉంది. అదే సమయంలో ఒక కిలో వెండి ధర రూ. 1,59,143 చేరి చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరుకుంది.
1/6బంగారం ధరల్లో ఈ భారీ పెరుగుదల వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న ఆర్థిక మార్పులేనని చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఒక్క ఔన్స్ బంగారం ధర సుమారు 4,000 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది.
2/6ఇది పసిడి విలువను ప్రపంచవ్యాప్తంగా పెంచడానికి దారితీసింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి, అదే సమయంలో అమెరికన్ డాలర్ విలువ 10 శాతం తగ్గింది.
3/6డాలర్ బలహీనత కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై రాబడి తగ్గిపోవడం కూడా పసిడి మీద డిమాండ్‌ను పెంచిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం రిజర్వులు పెరుగుతున్నాయి.
4/6భారత మార్కెట్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ. 75,000 ఉండగా, ఇప్పుడు అది రూ. 1.26 లక్షలకు చేరుకుంది. ధరలు ఇంతగా పెరగడంతో, బంగారం ఆభరణాల కొనుగోలు గణనీయంగా తగ్గింది. జ్యువెలరీ షాపులకు వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా పడిపోయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
5/6ఇక మరోవైపు, వెండి కూడా ఈ ర్యాలీలో వెనుకబడలేదు. ఒక కిలో వెండి ధర ఇప్పుడు రూ. 1.59 లక్షలు, ఇది చరిత్రలో ఎప్పుడూ లేని రికార్డు. పరిశ్రమల్లో వెండి వినియోగం పెరగడం, అలాగే ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి రంగాల్లో డిమాండ్ అధికం కావడం దీని వెనుక ప్రధాన కారణాలు.
6/6మొత్తానికి, బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రతిబింబంగా మారాయి. డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు, పెట్టుబడి పెరుగుదల వంటి అంశాలు పసిడి ధరలను మరింత పైకి నడిపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.