Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. మే 16వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93920 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 86090 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ.107900 పలుకుతుంది. పసిడి ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా దాదాపు 8,000 తక్కువగా ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర భారీగా తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా టెహ్రాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ త్వరలో ఒక ఒప్పందానికి వస్తాయనే ఆశల మధ్య గురువారం ముడి చమురు ధరలు పడిపోయాయి. మధ్య ప్రాచ్య పర్యటన సందర్భంగా ఖతార్‌లోని దోహాలో ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా దగ్గరగా ఉందని అన్నారు.
అమెరికా-ఇరాన్ అణు ఒప్పందం చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు నుంచి స్టాక్ మార్కెట్ వైపు తరలించే అవకాశం ఉంటుంది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి తగ్గుతూ వస్తున్నాయి.
పసిడి ధర ఒక ఔన్స్ అమెరికా కామెక్స్ మార్కెట్లో 3500 డాలర్ల ఆల్ టైం స్థాయి నుంచి ఏకంగా 3200 డాలర్లకు పడిపోయింది అంటే దాదాపు 300 డాలర్లు తగ్గినట్లు గమనించవచ్చు. మరోవైపు భారత ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి జూన్ 6వ తేదీ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 93,000 సమీపంలో ఉంది. ఇది ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా రూ. 7,000 తక్కువగా భావించవచ్చు.
రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బంగారం ధరలు రిటైర్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 86 వేల రూపాయలకు దాగిపోయింది. దీంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.
తగ్గుతున్న బంగారం ధరల కారణంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి డిమాండ్ కూడా పెరుగుతుందని దుకాణదారులు భావిస్తున్నారు. మరోవైపు తగ్గుతున్న బంగారం ధరల కారణంగా భవిష్యత్తులో మరింత తగ్గుతుందని పసిడి ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.