Silver Loans: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బంగారు ఆభరణాలపై మాత్రమే రుణాలు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు 2026 ఏప్రిల్ 1 నుంచి వెండి ఆభరణాలపై కూడా లోన్ తీసుకునే అవకాశం ఉండబోతోంది. బ్యాంకులు, NBFC లు (Non-Banking Financial Companies), కోఆపరేటివ్ మరియు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఈ సేవను అందిస్తాయి.
ఇకపై ప్రజలు తమ వెండి ఆభరణాలు లేదా నాణేలు తాకట్టు పెట్టి రుణం పొందగలరు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి.. గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న వ్యాపారాలు, గృహ అవసరాలు లేదా అత్యవసర ఖర్చుల కోసం ఇప్పుడు వెండి రుణం కూడా ఒక కొత్త మార్గం అవుతుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో.. ఈ వార్త అందరిని సంతోష పెడుతుంది.
RBI సర్క్యులర్ ప్రకారం, బంగారు ఆభరణాలు: గరిష్టంగా 1 కిలోగ్రాము వరకు వెండి ఆభరణాలు: గరిష్టంగా 10 కిలోగ్రాములు వరకు బంగారు నాణేలు: 50 గ్రాములు వరకు వెండి నాణేలు: 500 గ్రాములు వరకు తాకట్టు పెట్టవచ్చు.
రుణం మొత్తాన్ని LTV (Loan-to-Value) నిష్పత్తి ఆధారంగా నిర్ణయిస్తారు. రూ. 2.5 లక్షల లోపు రుణాలకు గరిష్ట LTV 85% రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షల మధ్య రుణాలకు 80% రూ. 5 లక్షల పైబడిన రుణాలకు 75% వరకూ రుణం పొందవచ్చు. అంటే మీరు వెండి లేదా బంగారం విలువలో 85% వరకు డబ్బు రుణంగా పొందగలరు.
ఈ నిర్ణయం వల్ల ప్రజలు తమ ఆభరణాలను అమ్మకుండా కూడా తాత్కాలిక ఆర్థిక ఇబ్బందులను సులభంగా ఎదుర్కోవచ్చు. బ్యాంకులు, NBFC లు కూడా ఈ విధానంతో కొత్త కస్టమర్లను ఆకర్షించగలవు.
మొత్తానికి, RBI తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు పెద్ద ఉపశమనంగా మారనుంది. బంగారంతో పాటు ఇప్పుడు వెండిపై కూడా రుణం తీసుకోవడం సాధ్యమవుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూలంగా మారుతుంది.