RBI Gold Reserves: భారతదేశం తన బంగారు నిల్వలతో చరిత్ర సృష్టించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం, దేశ బంగారు నిల్వలు తొలిసారిగా 100 బిలియన్ డాలర్లను దాటాయి. బంగారం ధరల పెరుగుదల, డాలర్‌పై ఆధారాన్ని తగ్గించాలనే ధోరణి ఈ రికార్డుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
1/6భారతదేశం తన ఆర్థిక చరిత్రలో ఒక కొత్త మైలురాయిని సాధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా విదేశీ మారక నిల్వల గణాంకాల ప్రకారం, భారతదేశ బంగారు నిల్వలు తొలిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటాయి. ఇది దేశ ఆర్థిక బలాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక ఘట్టంగా పరిగణిస్తోంది.
2/62025 అక్టోబర్ 10తో ముగిసిన వారానికి సంబంధించిన RBI నివేదిక ప్రకారం, కేవలం ఒక వారంలోనే బంగారు నిల్వలు 3.595 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 102.365 బిలియన్లకు చేరుకున్నాయి. అయితే, మొత్తం విదేశీ మారక నిల్వలు మాత్రం 2.18 బిలియన్ డాలర్లు తగ్గి 697.784 బిలియన్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం భారతదేశ మొత్తం నిల్వల్లో బంగారం వాటా 14.7 శాతానికి చేరుకుంది. ఇది 1996–97 తర్వాత అత్యధిక స్థాయి.
3/6గత పది సంవత్సరాలుగా భారత్ బంగారాన్ని తన రిజర్వ్‌లో కీలకంగా నిల్వ చేస్తూ వస్తోంది. ఈ పెరుగుదల వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. RBI బంగారం కొనుగోళ్లు కొనసాగించడం, ప్రపంచ బంగారం ధరల పెరుగుదల కారణంగా చెబుతోంది. 2025లో తొలి తొమ్మిది నెలల్లో RBI కేవలం 4 టన్నుల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేసినప్పటికీ, బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరగడం వల్ల భారత నిల్వల విలువ గణనీయంగా పెరిగింది.
4/6నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది బంగారం ధరలు దాదాపు 65 శాతం పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆంక్షల భయం, "డీ-డాలరైజేషన్" ధోరణి కారణంగా అనేక దేశాలు తమ రిజర్వ్‌లను డాలర్ నుండి బంగారంలోకి మార్చుతున్నాయి. ఈ పరిణామం బంగారం విలువను మరింత పెంచుతూ, ఆస్తి భద్రతలో బంగారాన్ని ప్రధాన స్థానంలో నిలిపింది.
5/6భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ బంగారం పెట్టుబడి మాత్రమే కాదు, సంస్కృతి, సామాజిక ప్రతిష్ఠలో భాగం కూడా. వివాహాలు, పండుగలు, ధనలక్ష్మి పూజలు .. ఇవన్నీ బంగారంతో విడదీయరానివి బంధం ఉంది. ధరలు పెరిగినా కూడా భారతీయుల బంగారం కొనుగోలు ఉత్సాహం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో RBI కూడా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా కొనసాగిస్తోంది.
6/6నిపుణుల అంచనా ప్రకారం, బంగారం విలువ పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తోంది. రాబోయే కాలంలో బంగారం ధరలు స్థిరంగా లేదా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని ఫలితంగా భారతదేశ విదేశీ నిల్వలు మరింత బలోపేతం అవుతాయని, ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలంగా నిలుపుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..