IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. ఇది మినీ వేలం కావడంతో ఒకే రోజులో ముగుస్తుంది. అయితే ఈసారి ముగ్గురు స్టార్ ఆటగాళ్ల కోసం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారీ బిడ్లకు సిద్ధమవుతున్నాయి. మినీ వేలం కోసం 1,355 మంది ఆటగాళ్లు నమోదు చేసుకోగా.. మొత్తం 77 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 31 విదేశీ ఆటగాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
1/5ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక బేస్ ధర రూ. 2 కోట్లు కాగా.. ఈ విభాగంలో 45 మంది ప్లేయర్లు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో ఇద్దరు భారతీయ ఆటగాళ్లు, ఒక విదేశీ ప్లేయర్ ఉన్నారు. ఆ ఆటగాళ్లు ఎవరంటే..ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్, స్పిన్నర్ రవి బిష్టోయ్ మరియు ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరాన్ గ్రీన్.
2/5గత సీజన్‌లో వెంకటేష్ అయ్యర్ అత్యంత ఖరీదైన ప్లేయర్లలో మూడవ స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని రూ.24 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ 2025లో అయ్యర్ ప్రదర్శన సాధారణంగా ఉండటంతో.. ఈసారి వేలానికి ముందే అతన్ని రిలీజ్ చేసింది. దీంతో ఇప్పుడు చాలా జట్లు వెంకటేష్ అయ్యర్‌ను దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అయ్యర్ కోసం పోటీ తీవ్రంగా ఉండబోతుంది.
3/5రవి బిష్ణోయ్ ఐపీఎల్ 2022 నుంచి లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ వచ్చాడు. కానీ 2025 ఐపీఎల్‌లో అతని ప్రదర్శన అంచనాలను అందుకోకపోవడంతో.. రీలీజ్ చేసింది. ఇప్పటివరకు అతను మొత్తం 77 మ్యాచ్‌లు ఆడి 72 వికెట్లు తీసిన యంగ్ లెగ్ స్పిన్నర్. ఇప్పుడు వేలంలో అన్ని జట్లలోనూ రవిపై ఆసక్తి ఉంది. కానీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తప్పకుండా దక్కించుకోవాలని చూస్తోంది. చెన్నైకి మంచి భారత స్పెషలిస్ట్ లెగ్ స్పిన్నర్ అవసరం ఉంది. కాబట్టి రవి బిష్ణోయ్‌ను తమ జట్టులో చేర్చుకోవాలని సీఎస్‌కే బలంగా ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది.
4/5ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసక ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా ఐపీఎల్ 2026 మినీ వేలంలోకి రానున్నాడు. ఐపీఎల్ 2024లో ఈ ఆటగాడిని ఆర్సీబీ.. ముంబై ఇండియన్స్ నుండి రూ. 17.5 కోట్లకు ట్రేడ్ చేసుకుంది. గత సీజన్‌లో అతను గాయం కారణంగా ఆడలేకపోయాడు, కానీ ఈసారి తిరిగి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెగా వేలంలో ఇతడి కోసం జట్లు పోటీ పడవచ్చు. గ్రీన్.. ఆస్ట్రేలియా ఫ్రంట్‌లైన్ ఆటగాడు, అతని ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉంది. ఈ క్రమంలో ఇతడిపై రూ. 25 కోట్ల వరకు బిడ్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా CSK, KKR మధ్య ఈ ఆటగాడి కోసం గట్టి పోటీ కనిపించవచ్చు.
5/5ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో నిర్వహించనున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 10 ఫ్రాంచైజీలు 173 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇందులో కొన్ని ట్రేడ్‌లు కూడా జరిగాయి. ఈ జాబితాలో 49 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ మినీ వేలం కోసం అన్ని జట్లలో మొత్తం 77 స్లాట్లు మిగిలి ఉన్నాయి. అన్ని జట్లను కలిపి మొత్తం ₹237.55 కోట్లు పర్స్‌లో ఉన్నాయి.