Japan Prime Minister Shigeru Ishiba: జపాన్ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్.. ప్రధాని పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతోనే ఇషిబా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది..
1/5జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా తన పదవి నుంచి తప్పుకున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని జపాన్ టీవీ ఛానెల్ ఎన్‌హెచ్‌కే తెలిపింది. జులైలో జరిగిన పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల్లో అధికార పార్టీ మరియు దాని భాగస్వామి కొమైటో మెజారిటీ కోల్పోయాయి. 248 సీట్లలో 50 సీట్లు సాధించాల్సి ఉండగా, కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి.
2/5గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన దిగువ సభ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయింది. 1955లో స్థాపితమైన ఈ పార్టీ మొదటిసారిగా రెండు సభల్లోనూ మెజారిటీ కోల్పోయింది. మొదట ఇషిబా పదవిలో కొనసాగుతానని చెప్పినప్పటికీ, పార్టీలో ఒత్తిడి పెరగడంతో రాజీనామా చేశారు.
3/5గత ఏడాది సెప్టెంబర్‌లో మాజీ ప్రధానమంత్రి ఫుమియో కిషిద స్థానంలో ఇషిబా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై.. 2024 అక్టోబర్ 1న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో 9 మంది పోటీ పడ్డారు, అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. లక్షల మంది పార్టీ సభ్యులు ఓటు వేయడంతో ఇషిబా విజయం సాధించారు.
4/5ఇషిబా మొదట బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. 1986లో 29 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు. కిషిద ప్రభుత్వంలో ఆయనను పక్కన పెట్టారు. గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు మరియు పార్టీ అధ్యక్ష పదవికి ఐదుసార్లు పోటీ చేశారు.
5/5మాజీ ప్రధానమంత్రి కిషిద పార్టీ కార్యక్రమాల టికెట్ల విక్రయం ద్వారా నిధులు సేకరించి కుంభకోణంలో చిక్కుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో 80 మందికి పైగా పార్టీ సభ్యులు భాగస్వాములని విమర్శలు వచ్చాయి. దీంతో కిషిద ప్రజాదరణ తగ్గిపోయింది. కేబినెట్‌లోని పలువురు మంత్రులను, పార్టీ కార్యనిర్వాహక సభ్యులను తొలగించి, నిధుల నియంత్రణ కోసం కొత్త చట్టం తెచ్చినప్పటికీ, స్థానిక మరియు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.