Sri Vidya Kamal Haasan: ఇండస్ట్రీలో తెరపైనే కాదు తెర వెనక కూడా ఎన్నో ప్రేమకథలు జరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ప్రేమకథలకు శుభం కార్డు పడగా.. కొన్ని కథలు మాత్రం ట్రాజెడీ గా మిగిలిపోతాయి. అలాంటి ప్రేమ కథల్లో ఒకటే కమల్ హాసన్, శ్రీవిద్య ప్రేమ కథ.
తమిళ సినీ పరిశ్రమలో గొప్ప నటిగా పేరు పొందిన శ్రీవిద్య, కమల్ హాసన్‌తో తన సంబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సెన్సేషన్‌గా మారాయి. 1970లలో ఇద్దరూ సినీ రంగంలోకి కొత్తగా అడుగుపెడుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారం చిత్ర పరిశ్రమకు, కుటుంబ సభ్యులకు తెలిసినదే. అయితే ఈ బంధం ఊహించని విధంగా ముగిసింది.
శ్రీవిద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బ్రేకప్ జరిగినప్పుడు తాను తీవ్రంగా మానసికంగా బాధపడ్డానని, జీవితమే ముగిసిపోయినట్లుగా అనిపించిందని పేర్కొన్నారు. కమల్ తండ్రి తనను కుటుంబ సభ్యురాలిలా చూసేవారని చెప్పిన ఆమె, కమల్ కెరీర్‌లో బిజీ అవుతున్నప్పుడు తమ ప్రేమ కూడా దూరం అయిపోయిందని తెలిపారు.
వారి బ్రేకప్‌కి ముఖ్యమైన కారణం విషయానికొస్తే.. కమల్ మరికొంత కాలం పెళ్లి ఆలస్యం చేయాలని కోరితే, శ్రీవిద్య మాత్రం కుటుంబ పెద్దల అభిప్రాయాన్ని గౌరవించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై కమల్ అసహనం వ్యక్తం చేశారంట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో శ్రీవిద్య నే తెలిపింది.
ఇక ఆ తర్వాత కూడా ఒకసారి కమల్ హాసన్ శ్రీవిద్య ఇంటికి వెళ్ళగా.. శ్రీవిద్య తల్లి మాట్లాడుతూ.. "ఇప్పుడు మీరు ఇద్దరూ యువకులు, మున్ముందు జీవితంలో మంచి అవకాశాలు వస్తాయి, ఆలోచించండి" అని చెప్పడంతో కమల్ కీ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారంట. ఇదే వారి ప్రేమకథ ముగింపు కావడానికి కారణమైంది.
ఆ తర్వాత కమల్ హాసన్ వాణి గణపతితో పెళ్లి చేసుకున్నారు. ఇది శ్రీవిద్య మనసును ముక్కలుగా చేసింది. ఆమె ఒక దశలో తనను తాను ఫెయిల్యూర్‌గా భావించేదట. వాణిలో ఉన్న ప్రత్యేకత తనలో ఎందుకు లేదని ఆవేదన చెందిందట. ఆ తరువాత వారు స్నేహితులుగా మెలగకపోయినా, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ కొనసాగారు.