Add Zee Business As A Preferred Source
App

KCR: వింటేజ్ కేసీఆర్ సార్.. మళ్ళీ హోమం బాట పట్టిన కారు వీరుడు.. ఫామ్‌హౌస్‌లో గణపతి పూజ..!!

Written ByBhoomi
Published: Sep 05, 2025, 01:27 PM IST|Updated: Sep 05, 2025, 01:27 PM IST

KCR Ganapathi Homam Eravelli:బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు సద్ధుమణుగుతాయా? రానున్న రోజుల్లో రెట్టింపు కానున్నాయా? ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో గణపతి హోమానికి సిద్దమయ్యారు గులాబీ బాస్. ఎలాంటి విఘ్నాలు వద్దనే ఈ హోం చేస్తేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 

KCR Ganapathi Homam Eravelli1/6

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్  మరోసారి హోమం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్  మరోసారి హోమంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ దంపతులు ఎప్పటినుంచో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ పలు యాగాలు, హోమాలు నిర్వహించడంలో ముందుంటారని తెలిసిందే. తాజాగా ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గణపతి హోమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.  ఈ కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు ఆయన భార్య శోభ కూడా పాల్గొననున్నారు. కుటుంబ విభేదాలు, పార్టీ అంతర్గత ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హోమం జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

KCR Ganapathi Homam Eravelli2/6

ప్రముఖ నేతలకు మాత్రమే ఆహ్వానం

 ఈ హోమానికి పార్టీకి చెందిన కొద్దిమంది ప్రముఖ నేతలకు మాత్రమే ఆహ్వానం అందినట్టుగా చెబుతున్నారు. కేటీఆర్ ఇప్పటికే ఎర్రవల్లిలో ఉండటం, కుటుంబసభ్యులు దగ్గరుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అయితే, ప్రతీ ఏడాది వినాయకచవితి, నవరాత్రుల సందర్భంలో ప్రత్యేక పూజలు చేయడం ఆయనకు అలవాటేనని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయినా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన మళ్లీ హోమం చేయడం వెనుక ఉన్న కారణాలపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

KCR Ganapathi Homam Eravelli3/6

కవిత వ్యవహారం

ఇక, ఇటీవల బీఆర్ఎస్‌లో పెద్ద కలకలం రేపిన పరిణామం కవిత వ్యవహారం. కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, పార్టీపై, నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ముందుకు రావడంతో ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కవిత పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను తెలంగాణ భవన్‌కు పంపారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి, లేఖను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. ఈ పరిణామాలతో కేసీఆర్ కుటుంబంలో, పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు చెలరేగాయి.

KCR Ganapathi Homam Eravelli4/6

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల

మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆమోదం తెలపడం, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుండటం కూడా బీఆర్ఎస్‌కు రాజకీయంగా ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తోంది. సొంత కూతురే తన పార్టీకి వ్యతిరేకంగా నిలబడటం, బయటా కేసులు, ఆరోపణలు పెరగడం వంటి పరిస్థితుల్లో కేసీఆర్ పండితుల సూచన మేరకు గణపతి హోమం చేపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

KCR Ganapathi Homam Eravelli5/6

క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ పెద్ద యాగాలు

ఇదిలాఉంటే, గతంలోనూ ముఖ్య నిర్ణయాల ముందు లేదా క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ పెద్ద యాగాలు నిర్వహించారు. 2015లో తన పాలన విజయవంతంగా సాగాలని చండీయాగం, 2018లో ముందస్తు ఎన్నికల ముందు రాజశ్యామల యాగం, 2023 ఎన్నికల ముందు మరోసారి యాగం నిర్వహించడం అందుకు ఉదాహరణ. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం చవిచూసింది. అలాగే గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత, కేసీఆర్ నవగ్రహ మహాయాగం, చండీయాగం కూడా నిర్వహించారు.

KCR Ganapathi Homam Eravelli6/6

కేసీఆర్ గణనాథుడి ఆశీర్వాదం

ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ గణనాథుడి ఆశీర్వాదం కోరుతూ గణపతి హోమం చేయడం, కుటుంబం-పార్టీ భవిష్యత్తుపై అనేక సందేహాలు రేకెత్తిస్తోంది. అయినా, ఇది ఆయన ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధించినదే అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.