Heavy Rains in Telangana: తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం వానలు కొంచెం తగ్గుముఖం పట్టడంతో.. ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. దీంతో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
1/5తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వీడటం లేదు. గత వారం రోజులుగా కురిసిన వానలతోనే ప్రజలు అతలాకుతలమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో.. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరుచేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా రహదారులపైకి వర్షపు నీరు చేరి రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
2/5మహారాష్ట్ర పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది నేడు అల్పపీడనంగా బలహీన పడనుంది. తరువాత పశ్చిమంగా మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా కదులుతూ.. అక్టోబర్ 1 నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
3/5అలాగే మంగళవారం అండమాన్ పరిసరాల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 1 నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు, మూడు రోజులు మోస్తరు నుంచి, తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
4/5తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాలు నాగర్ కర్నూల్, నల్గొండ, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం తరువాత నుంచి సాయంత్రం, రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
5/5అదేవిధంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.