Money Saving Tips: ఇంట్లో ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగాలంటే భార్య చేసే పొదుపు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి ఆదాయం బాగానే ఉంటుందేమో కానీ ఖర్చులు అదుపులో లేకపోతే నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అయితే పొదుపు చేసే భార్య ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆమె తన చిన్నచిన్న చిట్కాలతో ఇంటిని సుస్థిరంగా ఉంచుతుంది. భర్తకు ఆర్థిక ఒత్తిడి లేకుండా చూస్తుంది. నిజానికి, భార్య ఇంటి బడ్జెట్ కంట్రోల్ చేస్తే.. అది కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకే పునాది వంటిది అవుతుంది.
లక్కీ భాస్కర్ సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో హీరో దగ్గర రూపాయి లేకున్నా భర్త ఆర్థిక పరిస్థితిని చూసి భార్య కుటుంబాన్ని నెట్టుకువస్తుంది. ధైర్యంగా సంసారం నెట్టుకుపోయే భార్యలు వాస్తవ జీవితంలో కూడా చాలామంది ఉన్నారు. వారు కేవలం ఖర్చులు తగ్గించడమే కాదు, డబ్బును ఎక్కడ, ఎలా వాడాలో కూడా తెలివిగా ఆలోచిస్తారు.
ఉదాహరణకు వారాంతపు షాపింగ్‌లో అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండటం, మార్కెట్ ధరలు పోల్చి సరసమైన వాటిని తీసుకోవడం, వంటింట్లో కూరగాయలు వృథా కాకుండా వాడుకోవడం, విద్యుత్-నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటి చిన్న ప్రయత్నాలే పెద్ద పొదుపుగా మారతాయి.
మరింత తెలివైన భార్యలు నెలవారీ బడ్జెట్‌ను కాగితం మీద రాసుకుని ప్రతీ ఖర్చును గమనిస్తారు. కూరగాయల ఖర్చు నుంచి గ్యాస్ బిల్ వరకు అన్ని రికార్డులు ఉంచుతారు. ఈ అలవాటు వల్ల ఎక్కడ అధిక ఖర్చు జరుగుతోందో, ఎక్కడ తగ్గించవచ్చో సులభంగా గుర్తించవచ్చు.
అంతేకాదు, వారు పొదుపు చేసిన డబ్బును పెట్టుబడి రూపంలో ఉపయోగించి కుటుంబానికి భవిష్యత్తు భద్రతను కూడా కల్పిస్తారు. ఉదాహరణకు చిన్న మొత్తాల్లో RD లేదా SIP పెట్టడం వంటి పద్ధతులు భవిష్యత్తుకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయి.
పొదుపు అలవాటు ఉన్న భార్యలు ఇంట్లో ఆర్థిక క్రమశిక్షణను పెంచుతారు. భర్తకు అనవసరమైన ఒత్తిడి లేకుండా, పిల్లలకు స్మార్ట్ మనీ మేనేజ్‌మెంట్ నేర్పుతారు. ఇలాంటి భార్యలు ఉంటే భర్త నిజంగానే లక్కీభాస్కరుడు.
ఎందుకంటే ఆమె చేతిలో ఉండే ప్రతి రూపాయి కుటుంబ భవిష్యత్తును వెలిగించే దీపంలా పనిచేస్తుంది. మొత్తం మీద, డబ్బు సంపాదించేవారు భర్తలే కావచ్చు కానీ, దాన్ని నిలబెట్టేది మాత్రం పొదుపు తెలిసిన భార్యలే.