Nagarjuna About Sons: నాగార్జున తాజాగా తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. నాగచైతన్య, అఖిల్ ఇద్దరికీ కూడా ధైర్యం లేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఇంత మాట తన కొడుకుల గురించి ఎందుకు అన్నారు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగార్జున నటించిన శివ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో యువతలో కొత్త దిశను చూపింది. ఇప్పుడు ఈ లెజెండరీ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ రీ-రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఆర్డీజీవీ మాట్లాడుతూ, “శివ సినిమాలో మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు డాల్బీ ఆట్మాస్తో ఆ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుంది. అప్పట్లో నాగ్ సైకిల్ స్టంట్‌కి ఒప్పుకుంటాడని నమ్మలేదు, కానీ ఆయన ధైర్యంగా చేశాడు” అని అన్నారు.
అలాగే..ఆయన తన ఇన్‌స్పిరేషన్ గురించి మాట్లాడుతూ, “నేను ఎప్పుడూ బ్రూస్ లీ అభిమానిని. మొదట రాత్రి అనే చిన్న సినిమా చేయాలనుకున్నా. అప్పుడు వెంకట్ చెప్పాడు నాగార్జున కోసం ఓ కథ రాయమని. నేను "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" సినిమా 50వ సారి చూస్తున్నప్పుడు ‘రెస్టారెంట్ బ్యాక్‌డ్రాప్’ని కాలేజ్ సెట్‌గా మార్చి ‘శివ’ కథను 20 నిమిషాల్లో రాశా” అని చెప్పారు.
నాగార్జున కూడా తన భావాలను పంచుకున్నారు. “కొన్ని రోజుల క్రితం నేను మళ్లీ శివ చూశా. కొత్త సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది. అది ఒకసారి మాత్రమే లభించే అనుభవం. సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకి నాన్న గారు నన్ను డ్రైవ్‌కి తీసుకెళ్లి సినిమా హిట్ అయిందని చెప్పారు” అని గుర్తుచేసుకున్నారు.
అయితే, "శివ రీమేక్ గురించి అడిగితే, నాగార్జున నవ్వుతూ, "చైతు..అఖిల్కి శివ ని రీమేక్ చేయడానికి ధైర్యం లేదు” అని సరదాగా చెప్పారు. అంతేకాక, ఆయన తన భార్య అమలతో మళ్లీ ఒక సినిమాలో నటించాలనే కోరికను వ్యక్తం చేశారు.