School Holidays: దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్ ప్రభుత్వం అన్ని పాఠశాలలు, కళాశాలలను మరికొన్ని రోజులు మూసివేయాలని నిర్ణయించింది. గతంలో అవి సెప్టెంబర్ 4న తెరవాల్సి ఉండగా, ఇప్పుడు భారీ వర్షాలు, వరదల కారణంగా తేదీని మార్చారు. కొత్త ఉత్తర్వు ప్రకారం, సెప్టెంబర్ 7 ఆదివారం వరకు పాఠశాలలు మూసి ఉంటాయి.
1/6పంజాబ్ రాష్ట్రంలో వరదలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, నదుల ఉప్పొంగడంతో మూడు లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమవుతున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్‌లను మరికొన్ని రోజులు మూసివేయాలని నిర్ణయించారు.
2/6మొదటగా విద్యాసంస్థలను సెప్టెంబర్ 4న తిరిగి ప్రారంభించాలని ప్రణాళిక ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.
3/6తాజా ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబర్ 7 ఆదివారం వరకు అన్ని విద్యాసంస్థలు మూసిఉంటాయి. పరిస్థితులు మెరుగుపడితే, సెప్టెంబర్ 8 నుంచి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం తెలిపింది. అయితే అప్పటికీ వరదలు కొనసాగితే సెలవులను మరింత పొడిగించే అవకాశముంది.
4/6రాష్ట్ర విద్యా మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఈ విషయాన్ని ధృవీకరించారు. “ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సెప్టెంబర్ 7 వరకు మూసి ఉంటాయి. ప్రజలు స్థానిక పరిపాలన సూచనలను తప్పనిసరిగా పాటించాలి” అని ఆయన తెలిపారు.
5/6ఇక హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి వంటి ప్రధాన నదులు ఉప్పొంగాయి. చిన్న వాగులు, వంకలు కూడా పొంగిపొర్లి పంజాబ్‌లో పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి.
6/6ఇప్పటి వరకు వరదల వల్ల రాష్ట్రంలో 30 మంది మృతి చెందగా, 3.5 లక్షలకు పైగా ప్రజలు నష్టాలను ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు.