Sanchar Saathi App: భారత మార్కెట్లోకి కొత్తగా విడుదలయ్యే ప్రతి స్మార్ట్ ఫోన్ లో సంచార్ సాథీ యాప్ ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని డిలీట్ చేయకుండా డిఫాల్ట్ గా ఉంచాలనీ, సైబర్ సెక్యూరిటీ బలోపేతమే దీన్ని ప్రధాన లక్ష్యమని కేంద్రం పేర్కొంది. అసలేంటీ సంచార్ సాథీ.. కేంద్రం ఎందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1/7Sanchar Saathi App: భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాథీ పై వివాదం మళ్లీ ముదురుతోంది. భారత్ లో కొత్తగా విడుదలయ్యే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను తప్పనిసరిగా ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర టెలికం శాఖ ఇటీవల అనధికారికంగా ప్రధాన మొబైల్ తయారీదారులకు ఆదేశాలు పంపినట్లు సమాచారం. కొత్త పరికరం మార్కెట్లోకి వచ్చే ముందు నుంచే ఈ యాప్‌ను తొలగించలేనట్టుగా ఉంచాలని సూచించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
2/7ఈ నిర్ణయం అమల్లోకి వస్తే యాపిల్, శామ్‌సంగ్, వివో, షియోమి వంటి తయారీ దిగ్గజాలు అనేక సాంకేతిక, న్యాయపరమైన ప్రశ్నలను ఎదుర్కొనే అవకాశముంది. ప్రత్యేకంగా యాపిల్ అంతర్గత విధానాల ప్రకారం, సంస్థ తన డివైసుల్లో ప్రభుత్వ యాప్‌లు లేదా మూడవ పార్టీ యాప్‌లను ముందే పెట్టదు. అందుకే ఈ ఆదేశాలు సంస్థకు అభ్యంతరాల కారణం కావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
3/7సంచార్ సాథీ యాప్ ప్రభావం మాత్రం భారీగానే ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 7 లక్షలకు పైగా దొంగతనం జరిగిన ఫోన్లను గుర్తించి తిరిగి పొందడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ నెలలో మాత్రమే 50,000 పరికరాలు రికవరీ అయినట్లు ప్రభుత్వ డేటాలో ఉంది. చోరీకి గురైన ఫోన్ల IMEI నంబర్లను వెంటనే బ్లాక్ చేయడం.. అనుమానాస్పద కాల్స్‌పై యూజర్లు ఇచ్చే ఫిర్యాదులను ట్రాక్ చేయడం వంటి లక్షణాలు ఈ యాప్‌ను వినియోగదారులకు ఉపయోగకరంగా మార్చాయి.
4/7కానీ సమస్య యాప్ వినియోగం కాదు.. అనివార్యంగా ఇన్‌స్టాల్ చేసి, యూజర్‌కు డిసేబుల్ చేయడం కూడా అనుమతించకపోవడమే నిజమైన వివాదానికి దారి తీస్తోంది. నవంబర్ 28న పంపించిన ఆదేశాల ప్రకారం. కొత్తగా విడుదలయ్యే అన్ని ఫోన్లలో 90 రోజుల్లోపే ఈ యాప్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కొత్త ఫోన్లకూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా ఈ యాప్‌ను పంపాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఇవి అధికారిక ప్రకటనల రూపంలో కాకుండా.. ఎంపిక చేసిన కొన్ని కంపెనీలకే ప్రైవేట్‌గా పంపించినట్లు రాయిటర్స్ వెల్లడించింది.
5/7యాపిల్ మాత్రం ఈ నిర్ణయాన్ని పాటించడానికి ప్రధాన ఆటంకాలను సూచించవచ్చని భావిస్తున్నారు. కంపెనీ తమ పరికరాల్లో ముందుగా యాప్‌లను చేర్చడంపై కఠినంగా ఉన్న కారణంగా, యూజర్‌కి స్వయంగా సంచార్ సాథీని డౌన్‌లోడ్ చేసుకునే ఎంపిక ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం వద్ద సూచించే అవకాశం ఉంది.
6/7సైబర్‌క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం యాప్‌ల ద్వారా నియంత్రణ పెంచేందుకు ప్రయత్నిస్తుండగా, కంపెనీలు మాత్రం వినియోగదారుల గోప్యత, పరికర నియంత్రణ స్వేచ్ఛ వంటి అంశాలను ముఖ్యంగా ప్రస్తావిస్తున్నాయి. ఈ కొత్త ఆదేశం అమలు విధానం, పారదర్శకత, వినియోగదారుల హక్కులు..ఈ మూడు అంశాలు వచ్చే రోజుల్లో పెద్ద చర్చకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.
7/7ఇక సంచార్ సాథీ యాప్ లో ఉండే ముఖ్యమైన ఫీచర్లు ఇవి: పోయిన ఫోన్ లేదా దొంగలించిన ఫోన్లను దేశవ్యాప్తంగా బ్లాక్ చేస్తుంది. ఐఎంఈఐ నెంబర్ మార్చిన ఫోన్లను గుర్తిస్తుంది. వినియోగదారుని పేరుతో నమోదు అయిన అన్ని సిమ్ నెంబర్లను చెక్ చేస్తుంది. మోసపూరిత కాల్స్ లేదా మెసేజ్ లను రిపోర్ట్ చేసే సేఫ్టీ ఫీచర్ ఇందులో ఉంది. కేవైఎం ద్వారా ఫోన్ అసలైనదో కాదో తెలుసుకోవచ్చు.