SEBI On Digital Gold Investment: బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్ చెప్పింది సెబీ. భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తాజాగా పెట్టుబడిదారులకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆన్‌లైన్ లేదా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం రూ. 10 లేదా రూ. 100తో కూడా డిజిటల్ బంగారంలో ఇన్వెస్ట్ చేయగలిగే ఈ కొత్త మార్గాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ ప్లాట్‌ఫామ్‌లు సెబీ నియంత్రణ పరిధిలోకి రాకపోవడం వల్ల ప్రమాదకరమని సంస్థ స్పష్టం చేసింది.
సెబీ తన తాజా ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్ ఉత్పత్తులు సెక్యూరిటీల మార్కెట్ ఫ్రేమ్‌వర్క్ కింద లేవు. అంటే వీటిని సెక్యూరిటీలుగా లేదా వస్తువులుగా గుర్తించలేదు. అందువల్ల, ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టే వారికి సెబీ నియమాల ప్రకారం ఎటువంటి రక్షణ ఉండదు.
సెబీ ప్రకారం, ఇటీవల కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు పెట్టుబడిదారులకు డిజిటల్ గోల్డ్ లేదా ఇ-గోల్డ్ పేరుతో బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తున్నాయి. కానీ ఈ ఉత్పత్తులు అధికారికంగా గుర్తింపు పొందిన SEBI-నియంత్రిత గోల్డ్ ఉత్పత్తుల కింద రావు. అందువల్ల, వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడిదారులు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉందని సెబీ హెచ్చరించింది.
ప్రస్తుతం భారత మార్కెట్లో తనిష్క్ (Tanishq), MMTC-PAMP, ఆదిత్య బిర్లా బ్యాంక్ వంటి అనేక సంస్థలు డిజిటల్ గోల్డ్ సేవలను అందిస్తున్నాయి. ఉదాహరణకు, తనిష్క్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు కేవలం రూ. 100తోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ బంగారాన్ని భవిష్యత్తులో మార్చుకోవచ్చు లేదా తాకట్టు పెట్టవచ్చు అని కంపెనీ తెలిపింది.
అలాగే, MMTC-PAMP కూడా తమను డిజిటల్ గోల్డ్ రంగంలో అగ్రగామిగా పేర్కొంటూ, వినియోగదారులు ఎప్పుడైనా బంగారం కొనుగోలు చేయవచ్చని, అమ్మవచ్చని లేదా రీడీమ్ చేసుకోవచ్చని చెబుతోంది. ఆదిత్య బిర్లా బ్యాంక్ కూడా డిజిటల్ గోల్డ్ సేవలు అందిస్తున్న సంస్థలలో ఒకటి.
అయితే, మార్కెట్ నిపుణుల మాటల్లో, ఈ అన్ని ప్లాట్‌ఫామ్‌లు ప్రైవేట్ కంపెనీలచే నిర్వహించబడుతున్నందున భద్రత, పారదర్శకత విషయంలో సందేహాలు ఉండే అవకాశం ఉంది. బంగారం భౌతికంగా ఎక్కడ నిల్వ చేస్తోంది. ఆ భద్రతా ప్రమాణాలు ఏమిటి అన్న అంశాలు పెట్టుబడిదారులు ముందుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో సెబీ స్పష్టంగా పేర్కొంది డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ ఇవి సెక్యూరిటీ మార్కెట్ చట్టాల పరిధిలో లేని పెట్టుబడులు. అందువల్ల, వాటిలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని హెచ్చరించింది.