Women's World Cup 2025: టీమిండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ సాధించిన అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకొని.. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఓ మంచి గుడ్‌న్యూస్ చెప్పింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని ప్రతి ప్లేయర్‌కి త్వరలో విడుదల కానున్న సరికొత్త టాటా సియెరా ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదని.. వారి అద్భుతమైన ధైర్యసాహసాలు, అంకితభావం, దేశానికి గర్వకారణం తెచ్చిన స్ఫూర్తికి నిజమైన గౌరవమని టాటా మోటార్స్ తెలిపింది.
నవంబర్ 2న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత మహిళల జట్టు ప్రపంచ కప్‌ను గెలవడం ఇదే తొలిసారి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ MD, CEO శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. భారత మహిళా క్రికెట్ జట్టు తమ అసాధారణ ప్రదర్శన, అద్భుతమైన విజయంతో దేశం మొత్తాన్ని గర్వించేలా చేసింది. వారి ప్రయాణం పట్టుదల, విశ్వాసం యొక్క శక్తికి ఇది ప్రతీక.
ఈ విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుంది. టాటా మోటార్స్‌కు ఈ లెజెండరీ క్రీడాకారులకు మరో లెజెండ్ అయిన టాటా సియెరాను బహుమతిగా ఇవ్వడం గర్వకారణమని.. ఇది ఇద్దరు దిగ్గజాల ఉమ్మడి స్ఫూర్తికి, అనంతమైన ప్రేరణకు చిహ్నం అని అన్నారు.
భారత్‌కు ప్రపంచ విజయాన్ని అందించిన మహిళా క్రికెట్ జట్టులోని ప్రతి సభ్యురాలికి ఒక టాటా సియెరా ఎస్‌యూవీని బహుమతిగా ఇస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. టాటా సియెరాను నవంబర్ 25న అధికారికంగా విడుదల చేయనున్నారు. కంపెనీ సియెరా మొదటి బ్యాచ్‌లోని టాప్ మోడల్‌ను వారికి బహుమతిగా ఇవ్వనుంది.
ఈ టాటా సియెరాలో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, అధునాతన కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ లభించే అవకాశం ఉంది.
ఈ రెండూ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తాయి. టాటా సియెరా ధర గురించి ఖచ్చితంగా తెలియకపోయిన.. దీని ధరలు రూ. 13.50 లక్షల నుండి రూ. 24 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా.