Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు.. తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులు జరుగుతుండగా.. తాజాగా ఈ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం అనుసంధానం చేసింది. దీని ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణానికి తోడుగా నిలవడమే కాకుండా.. గ్రామీణ నిరుద్యోగులకు 90 రోజుల పని దినాలు కల్పించనున్నారు.
1/5రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు.. తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు కూడా చేపడుతుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. ఇళ్ల నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది.
2/5ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం అనుసంధానం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు గృహ నిర్మాణానికి తోడుగా నిలవడంతో పాటు.. గ్రామీణ నిరుద్యోగులకు కనీసం 90 రోజుల పనిదినాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
3/5ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. వారిలో 2.50 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. మిగిలిన వారిలో జాబ్ కార్డులేని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
4/5ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలు పెట్టి ఉపాధిహామీలో జాబ్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు.. బేస్‌మెంట్ స్థాయి వరకు 40 రోజులు, స్లాబ్ లెవల్ వరకు 50 రోజుల పని దినాలు కల్పించనున్నారు. ప్రస్తుతం ఉపాధి కూలీకి రోజుకు రూ. 307 వేతనం లభిస్తోంది. ఈ లెక్కన 90 రోజుల పాటు పని చేయడం ద్వారా సదరు ఒక్కో కూలీకి రూ.27,630 చెల్లించనున్నారు. దీంతో సొంతింటి నిర్మాణానికి కూలీ పని చేసుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది.
5/5అంతేకాదు.. స్వచ్ఛ భారత్ మిషన్ (SBM)లో టాయిలెట్స్ నిర్మాణంతోపాటు ఇతర పారిశుద్ధ్య పనులకు రూ.12 వేలు ఇవ్వనుంది. దీనికితోడు ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద రూ.72వేలు ఇస్తుండగా.. ఇప్పుడు ఉపాధిహామీ, స్వచ్ఛ భారత్ నిధులు అందించనుండటంతో లబ్ధిదారులకు అదనపు ప్రయోజనం చేకూరనుంది.