Gold Coins: 7వ శతాబ్దపు ససానియన్ దండయాత్ర సమయంలో హిప్పోస్ (సుస్సిటా)లో దాచిన దాదాపు 100 బంగారు నాణేలు, ఆభరణాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో బంగారం మాత్రమే కాదు.. వివిధ లోహాల మిశ్రమాలు కూడా ఉన్నాయి.
1/7Ancient Gold Coins: ఇజ్రాయెల్‌లోని గలిలీ సముద్రం సమీపంలో 1,400 సంవత్సరాల నాటి బంగారు నాణేలు, ఆభరణాల అరుదైన భారీ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. హిప్పోస్ (సుస్సిటా) అనే పురాతన నగరంలో తవ్వకాలు జరుగుతుండగా మెటల్ డిటెక్టర్ సహాయంతో ఈ నిధి బయటపడింది. నిపుణుల ప్రకారం, ఇది 7వ శతాబ్దంలో జరిగిన ససానియన్ దండయాత్ర కాలం నాటి ధనంగా చెబుతున్నారు.
2/7ఈ నిల్వలో 97శాతం స్వచ్ఛమైన బంగారు నాణేలుతో పాటు, ముత్యాలు, విలువైన రాళ్లతో చేసిన నగలు, గాజుతో అలంకరించిన చెవిపోగులు వంటి ఆభరణాలు కూడా లభించాయి. వివిధ లోహాల మిశ్రమాలతో తయారైన ఈ వస్తువులు, ఆ కాలపు సంస్కృతి, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకునేలా విలువైన ఆధారాలను అందిస్తున్నాయి.
3/7హైఫా విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త మైఖేల్ ఇసెన్‌బర్గ్ ప్రకారం, ఇది ఆ ప్రాంతంలో ఇప్పటివరకు బయటపడిన ఐదు అతిపెద్ద బంగారు నిల్వలలో ఒకటి అని చెబుతున్నారు. హిప్పోస్‌లో ఇలాంటి నిల్వ బయటపడటం ఇదే మొదటిసారి కావడం ప్రత్యేకత. నాణేలతో పాటు నగలు కూడా లభించడం ఈ కనుగొనికకు మరింత ప్రాధాన్యం తెచ్చిపెట్టింది.
4/7ఈ నిధిని ఎడ్డీ లిప్స్‌మన్ అనే నిపుణుడు కనుగొన్నారు. జూలైలో తవ్వకాలు చేస్తూ పెద్ద రాయి, పాత గోడల వద్ద లోహ పరికరం బీప్ అవ్వడంతో ఆయన అప్రమత్తమయ్యారు. మొదట పెద్దగా నమ్మకపోయినా, తవ్వకాలు కొనసాగించగా వరుసగా బంగారు నాణేలు బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోయారు.
5/7ఈ నాణేలపై బైజాంటైన్ చక్రవర్తుల చిత్రాలు చెక్కి ఉన్నాయి. వీటిలో జస్టిన్ I (518–527) నుండి హెరాక్లియస్ ప్రారంభ పాలన కాలం (610–613) వరకు నాణేలు ఉన్నాయి. కొన్ని నాణేలపై వస్త్ర అవశేషాలు కూడా కనిపించాయి. అంటే ఆ కాలంలో నిధిని భద్రపరచేటప్పుడు వస్త్రంతో చుట్టి పాతిపెట్టినట్టు అర్థమవుతోంది.
6/7ఇసెన్‌బర్గ్ మాట్లాడుతూ.. 1,400 ఏళ్ల నాటి నాణేలు, ఆభరణాలు నేటి వరకు సరికొత్తలాగా ఉండటం నిజంగా ఆశ్చర్యకరం అన్నారు. ముఖ్యంగా 610లో సైప్రస్‌లో ముద్రించిన ఒక అరుదైన ట్రెమిస్ నాణెం కూడా ఇందులో ఉంది. ఇది హెరాక్లియస్ ది ఎల్డర్, అతని కుమారుడు చక్రవర్తి ఫోకాస్‌పై తిరుగుబాటులో భాగంగా ముద్రించారు. తరువాత చిన్న హెరాక్లియస్ బైజాంటైన్ హెరాక్లియన్ వంశాన్ని స్థాపించి 610 నుండి 711 వరకు పాలించాడు.
7/7నాణేల నిపుణుడు డానీ సియోన్ ప్రకారం, ఈ ఆవిష్కరణ రాజకీయ, ఆర్థిక చరిత్రను అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. అయితే, ఈ నిధిని ఎందుకు ఖననం చేశారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చరిత్రకారులు చెబుతున్న ప్రకారం, ఆ సమయంలో హిప్పోస్ ప్రాంతం యుద్ధాలు, దండయాత్రలతో అస్థిరంగా ఉండేది. అందుకే స్థానికులు తమ సంపదను భద్రపరచడానికి ఇలా పాతిపెట్టివుండవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.