Vegetables Price Today (November 17): నిత్యావసర వస్తువుల ధరలైనా కావచ్చు.. కూరగాయల ధరలు అయినా కావచ్చు రోజు రోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు 100 రూపాయలు తీసుకుని మార్కెట్ కు వెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు కూరగాయల మార్కెట్ అంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు.
ప్రస్తుతం ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ. 50పైనే పలుకుతున్నాయి. టమాట లేని వంటకాన్ని ఊహించుకోలేము. కానీ దీని ధర అల్వాల్ రైతు బజార్ లో కిలో రూ. 30 పలుకుతోంది. దేశీయ టమాట అయితే రూ. 50పైనే ఉంది. దీంతో నెలవారీ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 100 రూపాయలు పట్టుకుని వెళ్తే కావాల్సిన కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుని వెళ్లినా సరిపడా కూరగాయలు రావడం లేదని రెట్టింపు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. కార్తీక మాసంలో కూరగాయల వినియోగం పెరగడంతోపాటు ఇటీవల తుఫాన్ల కు పంటలు దెబ్బతినడంతో ధరలు భారీగా పెరిగాయని రైతు బజార్ అధికారులు చెబుతున్నారు.
సికింద్రాబాద్, బొల్లారం, అల్వాల్ రైతు బజార్ లో కూరగాయలు ధరలు చూస్తే కిలో 50 రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ మార్కెట్లకు డైరెక్టుగా రైతులు తీసుకువచ్చి దళారులకు అమ్ముతుంటారు. కొంతమంది రైతులే అమ్ముతుంటారు.
కూరగాయల ధరలు చూస్తే టమాట కిలో రూ. 40 నుంచి 50 పలుకుతోంది. వంకాయ 80 నుంచి 60 రూపాయలు, బీరకాయ 80 నుంచి 60 రూపాయలు, కాకరకాయ 100 నుంచి 80 రూపాయలు, బెండకాయ 100 నుంచి 60 రూపాయలు పలుకుతున్నాయి.
ఇక దొండకాయ 80 నుంచి 60 రూపాయలు, క్యాబేజీ 80 నుంచి 60 రూపాయలు ఉంది. ఇక ఆకుకూరలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, సామగడ్డ ఇలా అన్ని కూరగాయల ధరలు 50 పైనే ఉన్నాయి. డిమాండ్ కు తగ్గట్లుగా దిగుమతి అవ్వకపోవడంతో ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పేద, సామాన్యులు, కూలీలను ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.