Zootopia 2 Impact On China: సాధారణంగా ఇళ్లలో కుక్కలు, కుక్క పిల్లలు, పిల్లులు, కుందేళ్లు, చిలుకలు.. ఇలా పెంచుకుంటారు. కానీ పాములను పెంచుకోవడం ఎక్కడైనా చూశారా? పిచ్చి కాకుంటే పాములను పెంచుకోవడం ఏంటి అనుకుంటున్నారా? అవును.. చైనా Gen-Z విషపూరిత పాములను ఇళ్లలో పెంచుకుంటున్నారు. ఈ పైత్యానికి కారణం తెలియాలంటే ఈ స్టోరీ చదవాలి.
1/9సినిమాలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలిపేందుకు చైనా ఉదాహరణగా నిలిచింది. పెద్దలు చెప్పే మాటలకన్నా.. చదివే పుస్తకాలకన్నా.. కన్నార్పకుండా చూసే సినిమాలే మన ఆలోచనల్ని మలిచే శక్తి కలిగి ఉంటాయి. చైనాలో తాజాగా విడుదలైన ఒక కార్టూన్ సినిమా ఇదే నిజాన్ని రుజువు చేసింది. తెరపై కనిపించిన ఒక పాత్ర ప్రభావంతో.. ప్రజలు తమ భద్రతను పక్కన పెట్టి.. ముఖ్యంగా Gen-Z అత్యంత ప్రమాదకరమైన పాములను ఇళ్లలో పెంచుకోవడానికి సిద్ధమవుతున్నారు.
2/9యానిమేటెడ్ చిత్రం జూటోపియా 2 చైనాలో బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టింది. రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 3.55 బిలియన్ యువాన్లు.. అంటే సుమారు 503 మిలియన్ డాలర్ల వసూళ్లు చేసి.. చైనాలో అత్యధిక వసూళ్లు చేసిన విదేశీ యానిమేటెడ్ సినిమాగా నిలిచింది. కానీ ఈ విజయం వెంటనే ఒక విచిత్రమైన.. ప్రమాదకరమైన ట్రెండ్‌కు దారితీసింది. సినిమా చూసిన తర్వాత.. ముఖ్యంగా యువతలో.. నీలిరంగు విషపూరిత పాముల పట్ల వింత మక్కువ పెరిగింది.
3/9సినిమాలో కనిపించిన నీలిరంగు పాము పాత్ర గ్యారీ ది స్నేక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదే ప్రభావంతో.. నిజ జీవితంలో కూడా అలాంటి పామును పెంపుడు జంతువుగా ఉంచుకోవాలనే ఆలోచన చాలామందిలో పుట్టింది. ఫలితంగా.. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో బ్లూ పిట్ వైపర్ అనే విషపూరిత పాము కోసం సెర్చ్‌లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాని ధరలు, అందుబాటు వివరాల కోసం జనాలు వెతకడం మొదలుపెట్టారు.
4/9బ్లూ పిట్ వైపర్ చూడటానికి నిజంగా చాలా అందంగా ఉంటుంది. ప్రకాశవంతమైన నీలం రంగు, ఆకర్షణీయమైన ఆకృతి దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. కానీ అందం వెనక దాగి ఉన్న ప్రమాదాన్ని మర్చిపోవడం ప్రాణాంతకం. ఈ పాము అత్యంత విషపూరితమైనది. ఇది సాధారణంగా చెట్లపై నివసిస్తుంది.
5/9బలమైన శరీరం, పట్టుకునే తోకతో పక్షులు, చిన్న జంతువులను వేటాడుతుంది. స్వభావరీత్యా ఇది దూకుడుగా ఉంటుంది. ప్రమాదం ఎదురైతే పారిపోవడం కన్నా దాడి చేయడానికే మొగ్గు చూపుతుంది. దీని కాటు మనిషి ప్రాణాలను కూడా తీసేంత ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
6/9చైనాలో పిట్ వైపర్‌లను పెంచుకోవడం పూర్తిగా నిషేధం కాకపోయినా.. సజీవ విష జంతువులను డెలివరీ చేయడం మాత్రం చట్టవిరుద్ధం. అయినప్పటికీ, కొందరు విక్రేతలు నిబంధనలను లెక్కచేయకుండా రహస్యంగా విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం.
7/9సినిమా విడుదలైన వెంటనే కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ పాముల జాబితాలు కనిపించడంతో ప్రభుత్వ సంస్థలు అప్రమత్తమయ్యాయి. మీడియా ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
8/9ఈ ఘటన చైనాలో ఇప్పటికే పెరుగుతున్న అన్యదేశ పెంపుడు జంతువుల ట్రెండ్‌లో మరో ప్రమాదకర అధ్యాయంగా మారింది. ముఖ్యంగా జెన్ Z యువతలో అరుదైన జంతువులను పెంచుకోవాలనే ఆసక్తి వేగంగా పెరుగుతోంది. అందులో సగానికి పైగా సరీసృపాలే ఉండటం గమనార్హం.
9/9జూటోపియా 2 ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టకపోయినా... దానికి ఇంధనం పోసిందన్నది నిజం. తెరపై వినోదంగా కనిపించిన పాము.. నిజ జీవితంలో ప్రాణాంతక ముప్పుగా మారుతుందని ఇప్పుడు అందరూ గ్రహించాల్సిన సమయం వచ్చింది.