)
Peddala Amavasya: మహాలయం అంటే గొప్ప వినాశనం అని అర్థం. లేదా మరణం అని అర్థం వస్తుంది. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసంలో కృష్ణపక్ష అమావాస్యకు మహాలయ అమావాస్య అని పిలుస్తారు. దీనినే పెద్దల అమావాస్య అని అంటారు. పితృదేవతల పూజలకు కేటాయించిన ప్రత్యేకమైన రోజు కావడంతో పెద్దల అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు ఏం చేయాలి? ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకుందాం.
భాద్రపద మాసంలో కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షం అని అంటారు. కృష్ణ పక్షంలో చివరి రోజు కావడంతో మహాలయ అమావాస్య అని పిలుస్తారు. మహాలయ పక్షానికి పితృపక్షమని పేరు. పితృదేవతలను శోభన దేవతలు అని కూడా అంటారు. వీరు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తుంటారు. అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం, పిండప్రదానాలు చేయడం, వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక పితృపక్షం అనే పేరు వచ్చింది. అయితే ఈ కాలం చెడు కాలం అని శుభకార్యాలకు పనికి రాదని పండితులు చెబుతారు. పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయ పక్షంలో.. మహాలయ అమావాస్య రోజు నిర్వహిస్తారు. దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది.
దేవదానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమి రోజు మొదలై అమావాస్య వరకూ మొత్తం 15 రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించడంతో రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేకమంది మహర్షులు, మునులు, యతులు ప్రాణాలు వదిలారు. వారు మృతి చెందిన రోజులకు యతి మహాలయం, శస్త్రహత మహాలయం అని పేర్లు వచ్చాయి. అమావాస్య వరకు దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతోపాటు అందరికీ అమావాస్య రోజు శ్రాద్ధ విధులు నిర్వహించారు. ఇక అప్పటి నుంచి మహాలయ పక్షంలో, మహాలయ అమావాస్య రోజు పితృదేవతల ఆరాధన చేస్తున్నారు.
కన్య, తులా రాశుల్లో సూర్య భగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలందరూ ఆహారం కోసం తమ ఇళ్ల చుట్టూ తిరుగుతుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరచడం కోసం శ్రాద్ధవిధులు ఆచరించడం, పిండప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడంలాంటి కర్మలు ఆచరిస్తుంటారు.
పిండప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకూ వేచి చూసే పితృదేవతలు అసంతృప్తితో శాపం పెట్టి పోతారని ప్రచారంలో ఉంది. అందుకే చాలా మంది పితృపక్షంలో శ్రాద్ధం చేస్తుంటారు. మహాలయ పక్షం దినేదినే గయాతుల్యం అని చెప్పారు. మహాలయ పక్షంలో మరణించిన వారికి శ్రాద్ధ విధులు రోజూ నిర్వహించాలి. రోజూ వీలు కాకపోతే తిథి రోజు చేయాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమి రోజు తర్పణ శ్రాద్ధవిధులు పెట్టాలి. లేదా అమావాస్య రోజు తప్పక చేయాలి.
మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధవిధులు నిర్వహిస్తే త్రివేణీ సంగమంలో.. గయలో శ్రాద్ధవిధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ, లేదా ఒక్క రోజుకాని, లేదా మహాలయ అమావాస్య రోజు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కంద పురాణంలో ఉంది. పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook