)
Mahalaya Paksham 2025: పితృ దేవతలకు ఎంతో ఇష్టమైన పక్షం కాబట్టి దీన్ని పితృ పక్షంగా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. పితృ పక్షాలు..మహాలయ పక్షం లేదా తెలంగాణలో ఈ పక్షం రోజులను పెత్తన అమాసగా పెద్దల అమావాస్యగా పిలుస్తుంటారు. ఈ పితృ పక్షాలు ఈనెల సెప్టెంబర్ 8 న ప్రారంభమై సెప్టెంబర్ 21 వ తేదీ మహాలయ అమావాస్యతో ముగుస్తాయి. ఈ పెద్దల అమావాస్య ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించుకోవడం వలన మనకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మహాలయ పక్షం రోజుల్లో చేసే శ్రాద్ద కర్మలకు మంచి ఫలితం ఉంటుందని శాస్త్ర వచనం. భాద్రపదలో శుక్లపక్షంలో గణపతి నవరాత్రిలు తర్వాత వచ్చే బహుళ పక్షం పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృదేవతా ఆరాధనలకు అంతే ముఖ్యమైనది. ఈ పక్షం ముగిసే వరకు ప్రతి రోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను తెలిసిన వాళ్లు శాస్త్రోస్తకంగా నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు పోయారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం చేయాలట. ఒకవేళ తిథి రోజు వీలు కాకపోతే.. అమావాస్య రోజున పిండ ప్రధనాలు చేయడం అత్యంత శ్రేయస్కరం.
నాన్న జీవించి, అమ్మ కన్నుమూస్తే.. ఈ పక్షంలో నవమి నాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలని శాస్త్రం ఘోషిస్తుంది. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజైన సెప్టెంబర్ 21వ తేది రోజున తర్పణం వదలాలి.
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి కన్నుమూసిన తర్వాత స్వర్గం ప్రాప్తించదట. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామనుకన్నాడు. ఆ పండు బంగారపు ముద్దగా మారిపోయింది.ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే రిపీట్ అయింది. ఇలా లాభం లేదనుకుని కనీసం దాహం తీర్చుకుందామని అక్కడున్న చెరువను నీటిని దోసిట్లో తీసుకొని నోటి ముందు పెట్టుకోవడమే ఆలస్యం అది కూడా సువర్ణమయం అయింది.
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి. దాంతో కర్ణుడు తాను చేసిన తప్ప ఏమిటి.. ? తనకిలా ఎందుకు జరుగుతున్నదని ఆలోచిస్తూ ఉండగా.. కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదని ఆశీరవాణి పలికింది. అందుకే నీకీ పరిస్థితి దాపురించిందన్నారు. .
కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి దీనికి ప్రాయశ్చితం కోరగా.. ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూప మైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.
అపుడు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ నిరుపేదలు,బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితృ దేవతలకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయిన అనుభవం కలిగింది. ఆకలి తీరి పోయింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు వచ్చిందని మన శాస్త్రాలున్నాయి. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కులాలకు,మతాలకు అతీతంగా మీ కుటుంబంలో, స్నేహితుల్లో, గురువుల్లో మరణించిన మీ మీ పితృదేవతలకు తిల (నువ్వులు) శ్రాద్ధం కానీ అన్న శ్రాద్ధం కానీ సమర్పించి వారి అనుగ్రహం పొంది మీ వంశాభివృద్ధికి పెద్దల ఆశీస్సులు లభిస్తాయనేది శాస్త్ర వచనం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.