IND vs NZ Highlights: ఫైనల్‌లో దుమ్ములేపిన రోహిత్ సేన.. ఛాంపియన్స్‌గా టీమిండియా

India Vs New Zealand Champions Trophy 2025 Final Highlights: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ దుమ్ములేపింది. కివీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి.. ఛాంపియన్‌గా అవతరించింది. ఆఖర్లో ఉత్కంఠ నెలకొన్నా.. ఎలాంటి తప్పులు చేయకుండా ట్రోఫీని సొంతం చేసుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 9, 2025, 10:49 PM IST
IND vs NZ Highlights: ఫైనల్‌లో దుమ్ములేపిన రోహిత్ సేన.. ఛాంపియన్స్‌గా టీమిండియా

India Vs New Zealand Champions Trophy 2025 Final Highlights: ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది.. 25 ఏళ్ల తరువాత ప్రతీకారం తీర్చుకుంది. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం భారత్.. మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (76) కెప్టెన్సీ ఇన్నింగ్ ఆడగా.. శుభ్‌మన్‌ గిల్ (31), శ్రేయాస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29), కేఎల్ రాహుల్ (34 నాటౌట్) రాణించారు. ఆఖర్లో పాండ్యా (18) విలువైన రన్స్ చేయగా.. జడేజా (9 నాటౌట్) ఫోర్‌తో విన్నింగ్ షాట్ కొట్టాడు. ఈ టోర్నీలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించి.. ఛాంపియన్‌గా నిలిచింది.

Add Zee News as a Preferred Source

 

ఫైనల్ పోరులో టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా వరుసగా 15 మ్యాచ్‌లో కూడా టాస్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు శుభారంభమే ఇచ్చారు. రచిన్ రవీంద్ర (37), విల్ యంగ్ (15) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్ల రాకతో పరిస్థితి మారిపోయింది. విల్‌ యంగ్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేయగా.. రచిన్ రవీంద్ర, విలియమ్సన్ (1)ను కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించాడు. 

డారిల్ మిచెల్ (63) ఓ ఎండ్‌లో నిలబడి ఇన్నింగ్స్‌ను నడిపించగా.. టామ్ లాథమ్ (14) విఫలమైనా.. గ్లెన్ ఫిలిప్స్ (34)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. లాథమ్‌ను జడేజా ఔట్ చేయగా.. ఫిలిప్స్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. ఆఖర్లో ప్రమాదకరంగా మారే సమయంలో మిచెల్‌ను షమీ పెవిలియన్‌కు పంపించాడు. బ్రాస్‌వెల్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో కివీస్ భారత్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. జడేజా, షమీకి చెరో వికెట్ దక్కింది.

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు అదరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ ఆరంభం నుంచే కివీస్‌ బౌలర్లపై ఆధిప్యతం చెలాయించాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ఫిలిప్స్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో శుభ్‌మన్ గిల్ (31) ఔట్ అయ్యాడు. ఆ తరువాత వెంటన్ విరాట్ కోహ్లీ (1)ను బ్రాస్‌వెట్ ఔట్ చేయడంతో రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (76) కూడా కాసేటికే ఔట్ అయ్యాడు. 

శ్రేయాస్ అయ్యర్‌కు జత కలిసిన అక్షర్ పటేల్ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో భారత్ లక్ష్యంవైపు దూసుకువెళ్లింది. అయితే కీలక సమయంలో అయ్యర్ (48) ఔట్ కావడం.. మరో 20 పరుగుల వ్యవధిలో అక్షర్ పటేల్ (29) కూడా ఔట్ అవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. కేఎల్ రాహుల్ (34 నాటౌట్), హార్థిక్ పాండ్యా (18) కివీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వేదు. ఆఖర్లో జడేజా (9 నాటౌట్) విలువైన రన్స్ చేయడంతోపాటు ఫోర్‌ బాది టీమ్‌ను గెలిపించాడు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, శాంట్నర్ తలో 2 వికెట్లు తీయగా.. జేమీసన్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కగా.. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు అందుకున్నాడు.

 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News