)
India vs South Africa ICC Womens ODI World Cup 2025: విశ్వ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్ పోరులో అమ్మాయిలు అదరగొట్టారు. సౌతాఫ్రికాపై అద్భుత విజయంతో మహిళల జట్టు తొలిసారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షోతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. అనంతరం సౌతాఫ్రికా టీమ్ 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును షెఫలీ వర్మ అందుకోగా.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా దీప్తి శర్మ నిలిచింది.
50 ఓవర్లు.. 298 పరుగుల లక్ష్యం.. లీగ్ దశలో భారత్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించిన సఫారీ టీమ్‌కు ఈ టార్గెట్ సరిపోతుందా అని అభిమానుల్లో టెన్షన్. ఈ టెన్షన్‌కు తగినట్లే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ మొదలైంది. కెప్టెన్ లారా వోల్వార్ట్ మరో ఓపెనర్ తజ్మిన్తో కలిసి ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అమన్‌జోత్ కౌర్ సూపర్ త్రోకు తజ్మిన్ రనౌట్ అయింది. వన్‌డౌన్ బ్యాటర్ అన్నెకె బోష్‌ను శ్రీ చరణి ఎల్డీడబ్ల్యూ చేసింది. ఈ దశలో సునె లూస్‌తో కలిసి వోల్వార్ట్ ఇన్నింగ్స్‌ను నిర్మించింది.
ఈ జంట ప్రమాదకరంగా మారుతున్న సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన బౌలింగ్ ఛేంజ్ వర్కౌట్ అయింది. షెఫలీ వర్మను రంగంలోకి దిపింది. మొదట సునె (31 బంతుల్లో 25, 4 ఫోర్లు)ను ఔట్ చేసిన షెఫలీ.. తన మరుసటి ఓవర్లో మారిజానె కాప్ (4)ను కూడా పెవిలియన్‌కు పంపించింది. సినాలో జఫ్తా (16)ను దీప్తి శర్మ ఔట్ చేయడంతో 148 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా లారా మాత్రం పోరాటం ఆపలేదు. అన్నెరి (37 ఒక ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడడంతో కాస్త కలవరం మొదలైంది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించగా.. ఈ జంటను దీప్తి విడదీసింది. 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ లారా.. కాసేపటికే దీప్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయింది. దీంతో టీమిండియా విజయం ఖాయమైపోయింది. మరో 26 రన్స్ చేసి ఆఖరి మూడు వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ ఐదు వికెట్లు తీయగా.. షెఫలీ వర్మ రెండు వికెట్లు పడగొట్టింది. శ్రీచరణికి ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ షెఫాలీ వర్మ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మృతి మంధాన (58 బంతుల్లో 45, 8 ఫోర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 17.4 ఓవర్లలోనే 104 పరుగులు జోడించారు. జెమీమా (24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (20) తక్కువ స్కోరుకే ఔట్ అయినా.. దీప్తి శర్మ (58 బంతుల్లో 58, 3 ఫోర్లు, ఒక సిక్స్) చక్కగా ఆడింది. రీచా ఘోష్ (24 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖర్లో దూకుడుగా ఆడడంతో భారత్ 50 ఓవర్లలో 298 పరుగులు చేసింది.