
Mumbai Indians vs Lucknow Super Giants Highlights: ముంబై ఇండియన్స్ మరోసారి అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనలో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్లో వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం పంత్ సేన 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో ఓడించింది. మిచెల్ మార్ష్ (34), ఆయూష్ బదోని (35) మాత్రమే రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. మొత్తం ఆరు విజయాలతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. ఐదు విజయాలతో లక్నో ఆరోస్థానంలో ఉంది.
ముంబై విధించిన 216 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన లక్నోకు ఆదిలో షాక్ తగిలింది. ఓపెనర్ మార్క్‌క్రమ్ (9)ను బుమ్రా ఔట్ చేశాడు. అయితే మార్ష్ (24 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (15 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పూరన్, రిషబ్ పంత్ (4)ను విల్ జాక్స్ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపించడంతో లక్నో కష్టాల్లో పడింది. ఆయూష్ బదోని (22 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. మార్ష్‌తోపాటు బదోనిని బౌల్ట్ ఔట్ చేయగా.. మిల్లర్ (24), అబ్దుల్ సమాద్ (2), అవేశ్ ఖాన్ (0) వికెట్లను బుమ్రా తీశాడు. చివరకు 20 ఓవర్ చివరి బంతికి 161 పరుగులకు లక్నో ఆలౌట్ అయింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. మెరుపు ఆరంభమే దక్కింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (12) తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను రెండు సిక్సర్లుగా మలిచినా.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ రికెల్టన్ (32 బంతుల్లో 58, 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. రికెల్టన్కు తోడు సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ముంబై స్కోరు పరుగులు పెట్టింది. విల్‌జాక్స్ (29) రాణించగా.. తిలక్ వర్మ (6), హార్దిక్ పాండ్య (5) మరోసారి విఫలమయ్యారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 25 నాటౌట్), కోర్బిన్ బాష్ (10 బంతుల్లో 20) మెరుపులు మెరిపించడంతో ముంబై స్కోరు 200 దాటింది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. దిగ్వేశ్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి