Sunrisers Hyderabad Vs Punjab Kings Highlights: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన. బాల్ పడితే సిక్సర్ అన్నట్లు బౌండరీల వర్షం కురిసింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమిపాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో కసి తీర్చుకుంది. పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్లతో ఓడించి.. వరుస ఓటములకు చెక్ పెట్టింది. పంజాబ్ విధించిన 246 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కొదమ సింహాంలా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లో 141 పరుగులు (14 ఫోర్లు, 10 సిక్సర్లు) చేసి ఎస్‌ఆర్‌హెచ్‌కు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందించాడు. ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 66, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు రెండో గెలుపు కాగా.. పంజాబ్ కింగ్స్‌కు రెండో ఓటమి. ఐపీఎల్ హిస్టరీలో ఇది రెండో అత్యధిక ఛేజింగ్.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 245 పరుగులు చేసింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందని ఎవరూ ఊహించలేదు. హైదరాబాద్‌కు మరో ఓటమి తప్పదేమో అని అందరూ అనుకున్నారు. అయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ క్రీజ్‌లోకి రాగానే.. అభిమానుల అనుమానాలను పటాపంచల్ చేస్తూ చెలరేగిపోయారు. ఓ ఎండ్‌లో అభిషేక్ శర్మ బౌండరీ వర్షం కురిపిస్తుంటే.. మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ యాంకర్ రోల్ పోషించాడు. వీరిద్దరి దూకుడుతో పవర్ ప్లే ముగిసే సమయానికి సన్‌రైజర్స్ 8౩ పరుగులు పిండుకుంది.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని.. తొలి వికెట్‌కు 12.2 ఓవర్లలోనే 171 పరుగులు జోడించారు. హెడ్‌ను చాహల్ ఔట్ చేసినా.. అభిషేక్ శర్మ మాత్రం జోరు తగ్గించలేదు. సిక్సర్లు వరుసబెట్టి బాదడంతో లక్ష్యం ఇట్టే కరిగిపోయింది. 222 పరుగుల వద్ద అభిషేక్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసినా.. అప్పటికే ఎస్‌ఆర్‌హెచ్ విజయం ఖాయమైంది. చివర్లలో మరో అవకాశం ఇవ్వకుండా క్లాసెన్ (21 నాటౌట్), ఇషాన్ కిషన్ (9 నాటౌట్) మ్యాచ్‌ను ముగించారు. మరో 10 బంతులు ఉండగానే.. ఎస్‌ఆర్‌హెచ్ విక్టరీ సాధించింది. పంజాబ్ బౌలర్లలో చాహల్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ప్రయాన్ష్ ఆర్య (13 బంతుల్లో 36, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రభుసిమ్రాన్ (23 బంతుల్లో 42, 7 ఫోర్లు, ఒక సిక్స్) తొలి వికెట్‌కు నాలుగు ఓవర్లలోనే 66 పరుగులు జోడించారు. ఇద్దరు ఎడపెడా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ప్రియాన్ష్‌ను ఔట్ చేసి హర్షల్ పటేల్ తొలి బ్రేక్ ఇచ్చాడు. కాసేటికి ప్రభుసిమ్రాన్‌ను ఇషాన్ మలింగ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (36 బంతుల్లో 82, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ దుమ్ములేపాడు. నేహల్ వధేరా (22 బంతుల్లో 27, 2 ఫోర్లు, ఒక సిక్స్) చక్కటి సహకారం అందించాడు.
వధేరాను మలింగ పెవిలియన్‌కు పంపించగా.. శశాంక్ సింగ్ (2), మాక్స్‌వెల్ (3) తక్కువ స్కోర్లకే ఔట్ చేయడంతో స్కోరు బోర్డు వేగం కాస్త తగ్గింది. సెంచరీ దిశగా దూసుకువెళ్లిన శ్రేయాస్ అయ్యర్ కూడా ఔట్ అయ్యాడు. చివరి ఓవర్‌లో షమీ బౌలింగ్‌లో స్టొయినిస్ చివరి నాలుగు బంతుల్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది 27 పరుగులు రాబట్టాడు. దీంతో 20 ఓవర్లలో పంజాబ్ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









