SRH Hattrick Defeat: ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అనంతరం వరుస మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమవుతూ హ్యాట్రిక్ ఓటములను చవి చూసింది. సొంత గడ్డతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాభవాన్ని మూటగట్టుకుంటోంది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ అన్నింట్లో ఘోరంగా విఫలమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ను 80 పరుగుల తేడాతో కోల్‌కత్తా చిత్తుగా ఓడించింది. స్ట్రాటజీ మార్చి మొదట బౌలింగ్ చేసినా కూడా జట్టు ప్రదర్శనలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో సన్‌రైజర్స్ అభిమానులు నైరాశ్యంలో మునిగారు. మొదట కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేయగా.. 16.4 ఓవర్లకు 120 పరుగులు మాత్రమే చేసి సన్‌రైజర్స్ కుప్పకూలింది.
Also Read: RCB vs GT Highlights: గురువుకు శిష్యుడి షాక్.. బెంగళూరు జోరుకు గుజరాత్ బ్రేక్!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొదట తడబడినా ఆఖరులో రఫ్ఫాడించి నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (7) విఫలమైన వేళ కెప్టెన్ అజింక్యా రహనే 38 పరుగులు చేశాడు. అనంతరం రఘువంశీ (50) అర్థ శతకం పూర్తి చేయగా.. ఆఖరులో వెంకటేశ్ అయ్యర్ బ్యాట్‌తో బీభత్సం సృష్టించాడు. 7 ఫోర్లు ౩ సిక్సర్లతో చెలరేగి ఆడాడు. 29 పరుగుల్లో 60 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్ 32* పరుగులు చేశాడు. ఆరంభంలో తడబడిన బ్యాటర్లు తర్వాత దూకుడుగా ఆడడంతో స్కోర్ ద్వి శతకం దాటింది. సన్‌రైజర్స్ బౌలర్లు కోలకత్తాను స్కోర్ చేయకుండా నిలువరించలేకపోయారు. ఆరంభంలో పొదుపుగా బౌలింగ్ వేయగా.. తర్వాత దాన్ని నిలుపుకోలేకపోయారు. సిమర్‌జిత్ సింగ్ మినహా మిగతా బౌలర్లంతా చెరొక వికెట్ సాధించారు.
Also Read: MI Beat KKR: డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కత్తాకు భారీ షాక్.. ముంబై సంచలన విజయం
టాస్ గెలిచినా కూడా బౌలింగ్‌కు దిగి స్ట్రాటజీ మార్చిన సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. 16.4 ఓవర్లకు కేవలం 120 పరుగులు చేసి మ్యాచ్‌ను ఆరెంజ్ ఆర్మీ చేజార్చుకుంది. టాపార్డర్‌తో సహా బ్యాటింగ్ దళం మొత్తం చేతులు ఎత్తేసింది. టాప్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్ (2) సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. నితీశ్ కుమార్ రెడ్డి (19) భారీ స్కోర్ చేయడంలో మరోసారి విఫలమవగా.. మెండీస్ చేసిన 33 పరుగులు అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. యువ సంచలనం అనికేత్ వర్మ కేవలం 6 పరుగులకే వెనుదిరగగా.. కమిన్స్ 14, హర్షల్ పటేల్ 3 పరుగులు చేశారు.
బ్యాటర్లు చేసిన భారీ స్కోర్‌ను కోల్‌కత్తా బౌలర్లు సురక్షితంగా కాపాడారు. ఆరంభం నుంచి బౌలర్లు దూకుడుతో బంతులు వేయడంతో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఏ ఒక్కరూ కూడా భారీ షాట్లు ఆడేందుకు సాహసించడం లేదు. ఏ బంతి ముడితే ఎక్కడ చిక్కిపోతామనే భయాందోళన ఏర్పడగా.. బౌలర్లందరూ వికెట్లు తీయడం విశేషం. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు తీయగా.. ఆండ్రె రస్సెల్ 2, హర్షిత్ రానా, సునీల్ నరైన్ తలా ఒక వికెట్ తీశారు.
అట్టడుగుకు సన్‌రైజర్స్
గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఎదురైన పరాభవం నుంచి తేరుకుని కోల్‌కత్తా జట్టు సొంత గడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చింది. రెండు ఓటములు.. రెండు విజయాలతో తన స్థానాన్ని కోల్‌కత్తా మెరుగుపర్చుకోగా.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానానికి చేరుకుంది. ఆరెంజ్ ఆర్మీ నుంచి ఈ ప్రదర్శనను ఎవరూ ఊహించడం లేదు. తొలి మ్యాచ్‌లో సంచలనం రేపిన సన్‌రైజర్స్ తర్వాత ప్రతి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమవడం ఆ జట్టు అభిమానులకే కాదు క్రికెట్ అభిమానులకు కూడా విస్మయం కలిగిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









