వీరేంద్ర సెహ్వాగ్‌తో తనను పోల్చవద్దు: గంభీర్
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషాను వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చవద్దని గౌతమ్ గంభీర్ జనాలకు హితవు పలికాడు.
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషాను వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చవద్దని గౌతమ్ గంభీర్ జనాలకు హితవు పలికాడు. షా ఇప్పుడే కెరీర్ ప్రారంభించాడని.. ఆయన శైలి డిఫరెంట్ అని.. 100 మ్యాచ్‌లు ఆడిన వీరూతో ఆయనను పోల్చడం సరికాదని గంభీర్ అన్నాడు. తాను పోలికలను అసలు నమ్మను అని కూడా గంభీర్ అన్నాడు. ఇలాంటి కామెంట్లు చేసే ముందు అందరూ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని కూడా గంభీర్ అన్నాడు.
వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షా.. సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ గంభీర్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటన భారత్‌కు పెను సవాలని తెలిపాడు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ కట్టుదిట్టంగా ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో ఆడటం కష్టమేమీ కాదని.. కానీ ఆచితూచి ఆడాలని గంభీర్ టీమిండియా సభ్యులకు సలహా ఇచ్చాడు. ప్రత్యర్థి జట్టు ఆసీస్ ఎప్పటికీ ప్రమాదకరమైనదేనన్నాడు.
అలాగే ఎంఎస్ ధోనీ స్థానంలో యువకుడైన రిషబ్ పంత్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు కూడా గంభీర్ సమాధానం ఇచ్చాడు. వయసు కాదు.. ప్రదర్శన మాత్రమే ఎవరికైనా దన్నుగా నిలుస్తుందని తాను అభిప్రాయపడ్డాడు.
36 ఏళ్లు అయినా.. 47 ఏళ్లయినా.. ప్రదర్శన మాత్రమే ఏ ఆటగాడికైనా కెరీర్ బలంగా మారేందుకు అవకాశమిస్తుందని.. యువ క్రికెటర్లు ఈ విషయాన్ని తెలుసుకోవాలని గంభీర్ అన్నాడు. క్రికెట్ రంగానికి వయసు ఏ విధంగానూ కొలమానం కాదని ఆయన తెలిపాడు.