
Govt Employees Retirement Benefits: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం ఇటీవల చేతులెత్తేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పలు సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. ఉద్యోగులు కోరికలు కోరవద్దు.. సర్దుకుపోవద్దు అనే సందేశాన్ని ఇస్తుండగా.. తాజాగా మరో సూచన చేసింది. రిటైర్మెంట్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు భారీగా బకాయి పడ్డామని.. వాటిని ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎదురు ప్రశ్నించారు.
కొలువుల పండుగ పేరిట హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ ఉద్యోగుల అంశాలను ప్రస్తావించారు. 'ప్రస్తుతం అప్పులకు చేసిన వాటికి మొత్తం వడ్డీలకే చెల్లిస్తున్నాం. ఇది ఒక సంవత్సరంతో తీరేది కాదు. ఇది ఎంతకాలం ఉంటే అంత కాలం కట్టాల్సిందే. ఇంకా పెరుగుతనే ఉంది. తగ్గట్లేదు' అని అప్పుల విషయమై రేవంత్ రెడ్డి తెలిపారు.
'ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిండ్రు. ఇప్పుడు 61 ఏళ్లు కూడా పూర్తయిన వారు పదవీ విరమణ పొందుతున్నారు. ఇప్పుడు పాత, కొత్త వారికి కలిపి రిటైర్మెంట్ ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు రూ.8 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. నెలకు ఉన్న వెసులుబాటు ప్రకారం రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు ఇస్తుంటే ఏమూలకు సరిపోతాయి? ఎవరికి ఇవ్వాలి?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
'35 ఏళ్లు ప్రభుత్వ సేవలు అందించిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయి కూడా లేదు' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'ఈ స్థితిలో నానా తంటాలు పడి తల తాకట్టు పెట్టి నెలకు రూ.200 కోట్లు.. రూ.300 కోట్లు ఇస్తూ సర్దుబాటు చేస్తున్నాం. ఇల్లు, ఆస్పత్రిలో ఉన్న వారికి అత్యవసరం ఉన్నవారికి ఇస్తూ సర్దుకుంటూ వస్తున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు రూ.8 వేల కోట్లు ఉన్నాయని పునరుద్ఘాటించారు. 'పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన రూ.8 వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇవ్వాలి' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'మార్కెట్లో ఏ అప్పు పుడతలేదు. ఎవరినీ నన్ను నమ్ముతలేడు' అని కుండబద్దలు కొట్టారు. 'తెలంగాణ రాష్ట్రం పేరు గొప్పగా ఉంది కానీ అప్పు పుట్టడం లేదు' అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
పెరుగుతున్న పదవీ విరమణ ఉద్యోగులు
'ఒక చిన్న అటెండర్ రిటైర్ అయితే రూ.50 లక్షలు ఆర్థిక ప్రయోజనాలు అందించాల్సి ఉంది. ఒక సాధారణ గెజిటెడ్ అధికారి రిటైర్ అయితే రూ.కోటి ఇరవై లక్షల బెనిఫిట్స్ ఇవ్వవలసి వస్తోంది. ప్రతి నెల వెయ్యి మంది పదవీ విరమణ పొందుతున్నారు. సంవత్సరం వరకు ఓ పది వేల మంది రిటైర్ అవుతున్నారు. వారి ఆర్థిక ప్రయోజనాలు అనేవి రూ.వందల కోట్లు వరదలా వస్తున్నాయి' అని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook