Telangana News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు కొత్త సమస్య ఎదురవుతోంది. తన నియోజకవర్గం ఆశ్వరావుపేటలో ఎమ్మెల్యేకు తెలియకుండానే అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. తాజాగా శ్వరావుపేటలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆది నారాయణకు అధికారులు సమాచారం ఇవ్వలేదు. దాంతో ఆహ్వానం లేకపోయినా మంత్రి చేపట్టే కార్యక్రమానికి హాజరైనా ఆది నారాయణ మంత్రి ఎదుటే అధికారులను నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. తనకు తెలియకుండా ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. తన మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. దాంతో మంత్రి తుమ్మల ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన శాంతించలేదు..
కొద్దిరోజులుగా అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆది నారాయణకు జిల్లా మంత్రులతో తెగ ఇబ్బంది ఎదురువుతోందట. స్వతహగా తుమ్మల ఖమ్మం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి..! మరోవైపు రాజకీయంగా ఎమ్మెల్యే మొదటి నుండి మంత్రి పొంగులేటి మనిషిగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో పొంగులేటి ఆదినారాయణకు ఆదిష్టానం వద్ద టికెట్ సంపాదించి గెలుపు కోసం అనేక విధాలుగా సహాయపడ్డారు. దీంతో గెలిచాక నియోజకవర్గంపై ఆయన పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారు. తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ అశ్వారావుపేటలో మాత్రం ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభివృద్ధి పనులకు శ్రీకారం చూడుతుండటం.. ఎమ్మెల్యేకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది..
ఇక అశ్వారావుపేటలో ఏ పని చేయాలన్నా ఇద్దరూ మంత్రులకు ఎమ్మల్యే చెప్పాల్సి వస్తోందట. ఒక్కోసారి సమయభావం, లేదంటే సమన్వయ లోపం వల్ల మంత్రులకు సమాచారం అందకపోకపోవడంతో ఎమ్మెల్యే తీరుపై వారు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి నియోజకవర్గానికి వస్తుండగా మరో మంత్రి తుమ్మలకు సమాచారం ఇవ్వడం లేదట. దాంతో ఈ విషయాన్ని జీర్ణించుకోని తుమ్మల అనుచరులు.. ఇప్పుడు ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రిని పిలుస్తున్నారట. మరోవైపు తుమ్మల సొంత మండలం దమ్మపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని తుమ్మల వర్గీయులకు కాకుండా ఎమ్మెల్యే మార్క్ చూపించారట.. ఈ అంశంపై కూడా తుమ్మల ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే తన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లేకుండా చూసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు అశ్వారావుపేటలో ప్రోటోకాల్ పాటించకపోవడంతో ఎమ్మెల్యే గుస్సా అయ్యారు. తన ఇలాకాకు మంత్రి వస్తున్నారనే సమాచారం తనకే తెలియకపోతే ఎలా అంటూ అధికారులను కొట్టినంత పనిచేశారు. అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. చివరకు మంత్రి బుజ్జగించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గేలేదు. అయితే మంత్రి తుమ్మల ఆదేశాల మేరకే ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదనే మరో టాక్ సైతం వినిపిస్తోంది. ఆది నారాయణ మంత్రి పొంగులేటి అనుచరుడు కావడంతోనే తుమ్ముల ఆయన్ను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మంత్రి వర్సెస్ ఎమ్మల్యేగా అశ్వరావుపేట పాలిటిక్స్ మారిపోయాయనే టాక్ వినిపిస్తోంది.









