Union Minister Bandi Sanjay: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. టీచర్, గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి టీచర్స్ కోటాలో పోటీచేసిన మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. గత రికార్డులను తిరగరాస్తూ.. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలోనే ఆయన గెలుపొందారు. మల్క కొమురయ్య గెలుపును బీజేపీ హైకమాండ్ ముందుగానే అంచనా వేసింది. అందుకే కేంద్రమంత్రి బండిసంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. దాంతో మూడు నెలలుగా బండి సంజయ్ ఉత్తర తెలంగాణలో అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం కష్టపడారు. ప్రతి 25 మంది ఓటర్లకు ఓ ఇంచార్జ్‌ను నియమించి వారికి బాధ్యతలను అప్పగించారు. దాంతో మూడు నెలలుగా అనేక సమావేశాలు నిర్వహిస్తూ.. క్యాడర్‌ను పరుగులు పెట్టించారు. మూడు నెలలుగా తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ప్రతి ఓటర్ను కలిసి అన్నితానై వ్యవహరించారు కేంద్రమంత్రి బండి సంజయ్..
ఇక కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మల్క కొమురయ్యకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెప్పారు. ఇది మామూలు విజయం కాదు.. మల్క కొమురయ్య ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. మోడీ మీదున్న నమ్మకమే దేశ వ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలు వేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం మల్క కొమురయ్య కృషి చేస్తారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
అటు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. నరేందర్‌రెడ్డి గెలుపు కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మూడుచోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించారు. గతంలో ఏ సీఎం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థాయిలో ప్రచారం చేయలేదు. అయినప్పటికీ గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. తెలంగాణలో బీసీ వాదం బలంగా ఉన్నప్పటికీ.. గ్రాడ్యుయేట్లు మాత్రం.. బీజేపీ వైపే మొగ్గుచూపారు. ఉమ్మడి కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్ధిని చిన్నమైల్ అంజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన రెండు ఎమ్మెల్సీ స్థానాలను BJP తన ఖాతాలో
ఇక ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు బాధ్యతను బండి సంజయ్ సవాల్‌గా తీసుకున్నారు. అటు కాంగ్రెస్ అభ్యర్ధి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా కరీంనగర్ వాస్తవ్యుడే కావడం.. ఆయనకు పలు విద్యాసంస్థలు ఉండటంతో బండి అనుక్షణం ఎన్నికల్లో గెలుపై వ్యూహాలు రచించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హోదాలో దేశమంతటా తిరగాల్సి ఉన్న.. కరీంనగర్‌లోనే ఆయన చాలా రోజులు మకాం వేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3 లక్షల యాబై వేల ఓట్లు ఉండగా.. వీరిలో లక్షా 8 వేల ఓట్లు కేవలం కరీంనగర్‌లోనే ఉన్నాయి. దాంతో ప్రతిఓటర్‌ను కలిసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అప్పట్లో జీవో నెంబర్ 317 పై తాను పోరాడిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు.
గతంలో 317 జీవోకు వ్యతిరేకంగా బండి సంజయ్ నిరహార దీక్షకు దిగారు. ఆయన దీక్షను భగ్నం చేస్తూ కేసీఆర్ సర్కార్ బండి సంజయ్‌కు అరెస్టు చేసింది. అప్పట్లో తనకు జరిగిన అవమానాన్ని తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బదులు తీర్చుకునేలా ప్రణాళికలతో దూసుకెళ్లారు.. ప్రతిరోజు కొత్త స్ట్రాటజీతో ఓటర్లను ఆకట్టుకున్నారు. బీసీ కులగణన, కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చూసుకున్నారు. ఇలా ప్రతిరోజు మీడియాలో బీజేపీ గెలుపుపై అంచనాలు పెరిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆయన స్ట్రాటజీ కారణంగానే రెండు సీట్లను బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలా మారిందని బీజేపీ శ్రేణులే అంటున్నాయి..
అంతేకాదు బీజేపీ అభ్యర్ధి అంజిరెడ్డి విజయంపై కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు రంజాన్ గిఫ్ట్ ఇచ్చారని సెటైర్లు వేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నేతలకు ఓటుకు 5 వేల రూపాయలు పంచిపెట్టారని విమర్శిఆంచారు. అటు బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైందన్న బండి సంజయ్.. కేంద్రం నిధులిస్తే ఇక్కడి ప్రభుత్వం తానే గొప్పలు పోతోందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పట్టు నిలుపుకోవడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు.. టీచర్ ఎమ్మెల్సీ సీటును బీజేపీ దక్కించుకోవడంపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు విషేస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి తెలంగాణలో బీజేపీ పార్టీ ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నానన్నానని ట్వీట్‌లో రాసుకొచ్చారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్ధుల గెలుపులో కీ రోల్ పోషించిన బండి సంజయ్‌ను పార్టీ హైకమాండ్ అభినంచినట్టు తెలుస్తోంది.
ఉత్తర తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తూనే.. ఓటర్లను ఆకట్టుకున్నందుకు మోడీ, అమిత్ షా ప్రశంసించినట్టు సమాచారం. రానున్న రోజుల్లోనూ ఇదే స్పీడ్‌ను కంటిన్యూ చేస్తూ.. టార్గెట్ తెలంగాణగా దూసుకెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. మొత్తం మీద రెండు చోట్ల కమలం పార్టీ అభ్యర్ధులు ఘన విజయం సాధించడంపై కమలం పార్టీలో కొత్త జోష్ వచ్చింది. దీంతో త్వరలో బండి సంజయ్‌కు బీజేపీ అధిష్టానం నుంచి కీలక పదవి రూపంలో రిటర్న్ గిఫ్ట్ రానుందని కమలం శ్రేణులు అంటున్నాయి.








