HCU Lands Dispute: హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం భూముల అంశంపై పోరాడుతున్న విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మద్దతు ప్రకటించారు. ఆందోళన సందర్భంగా పోలీసులు అమానుషంగా దాడి చేస్తూ.. అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. మానవత్వం లేదా? జుట్టుపట్టుకుని గొడ్డులాగా బాదుతారా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి, భూములమ్మితే తప్ప పాలించే పరిస్థితి లేదా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. 'ఆ మాత్రానికి మీరెందుకు? కేఏ పాల్‌కు అప్పగించినా అదే పనిచేస్తారు కదా?' అని ఎద్దేవా చేశారు.
Also Read: HCU Lands Sale: హెచ్‌సీయూలో రాజుకున్న అగ్గి.. భూముల అమ్మకంపై విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీయూలో ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది? వాళ్ల నోళ్లెందుకు మూతపడ్డాయి? అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ ఘటనపై తక్షణమే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై మండిపడ్డారు.
Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అర్ధరాత్రి రైలు సేవలు పొడిగింపు
'హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే... వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా? ఇదేం పద్దతి?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు విక్రయించకపోతే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? అని మండిపడ్డారు. రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అని నిలదీశారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సన్నబియ్యం ప్రారంభంపై బండి సంజయ్ స్పందిస్తూ... 'సన్నబియ్యం కార్యక్రమంలో ప్రధాని ఫొటో ఏది?' అని ప్రశ్నించారు. రేషన్ బియ్యం ఖర్చులో రూ.10 వేల కోట్లకుపైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2 వేల కోట్లు మాత్రమే. కిలోకు రూ.40 కేంద్రం చెల్లిస్తోంది. మీరు భరించేది కిలోకు రూ.10 మాత్రమే' అని బండి సంజయ్ లెక్కలు వివరించారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం గొప్పదా? రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా? అని ప్రశ్నించారు. అయినా కేంద్ర సహకారంపై ఎందుకు నోరు విప్పరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటిగా మారాయి. మజ్లిస్‌ను గెలిపించేందుకు ఆ రెండు పార్టీలు పోటీ చేయడం లేదు' అని బండి సంజయ్ ఆరోపించారు. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల్లో అభ్యంతరాలు ఉండడంతో వెంటనే న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గ్రూప్ 1పై అభ్యర్థులు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండడంతో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మెరిట్ విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









