వైఎస్ జగన్‌తో బీసీ నేత ఆర్ కృష్ణయ్య భేటీ!
వైఎస్ జగన్‌తో బీసీ నేత ఆర్ కృష్ణయ్య భేటీ!
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో శనివారం సాయంత్రం సుమారు అర్థ గంటకు పైగా ఆయన జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం జగన్ నివాసం బయట మీడియాతో మాట్లాడిన ఆర్ కృష్ణయ్య.. బీసీల రిజర్వేషన్‌పై చట్టసభల్లో చర్చ జరపాలని జగన్‌ను కోరినట్లు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ కోసం తొలిసారిగా ప్రైవేట్ బిల్ పెట్టినందుకు జగన్‌కు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు 14 పేజీలతో కూడిన ఓ వినతిపత్రాన్ని వైఎస్ జగన్‌కు అందించినట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ రిజర్వేషన్ గురించి రాజ్యసభలో వైఎస్సార్సీపీ తరఫున సమస్యను లేవనెత్తుతామని జగన్ తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు. వైఎస్ఆర్ బీసీల అభ్యుదయం కోసం ఎంతో కృషి చేశారనే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు కృష్ణయ్య చెప్పారు.
ఇదిలావుంటే, ఫిబ్రవరి 17న ఏలూరులో జరిగే బీసీ శంఖారావం సభకు రావాల్సిందిగా జగన్ తనను ఆహ్వానించగా... బీసీల కోసం ఎవరు, ఎక్కడ సభ పెట్టినా ఆ సభకు హాజరవుతానని ఆర్ కృష్ణయ్య తెలిపారు.