)
Bc Students Protest Latest Telugu News: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి (Telangana State Council of Higher Education) కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కూడా మద్దతు పలికి, విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.
వందలాది మంది విద్యార్థులు ఒక్కసారిగా ఉన్నత విద్యా మండలి కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గేటు లోపలికి వెళ్లడానికి విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. విద్యార్థులు తమ డిమాండ్లను నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి చాలా రోజులు గడిచినా.. విద్యార్థుల ఫీజుల బకాయిలను విడుదల చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థులు చదువు కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.3,600 కోట్లు ఉన్నాయని, వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెంటనే ఈ సమస్యపై స్పందించి.. నిధులు మంజూరు చేయాలని కోరారు. లేనిపక్షంలో, రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులతో తాను నివాసం ఉంటున్న పూలే భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
బీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఫీజుల బకాయిలను విడుదల చేయకపోతే తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని, ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ ఆందోళనలో పలు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి