Future City Hyderabad: హైదరాబాద్ లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ' (FCDA)ని ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మిస్తోంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది.
మహా నగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి అనుగుణంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా దీన్ని రూపొందించేందుకు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశారు.
ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (JICA) వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో బాగస్వామ్యం పంచుకుంటున్నాయి. దేశంలో మొట్టమొదటి నెట్-జీరో స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 15 వేల ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి అనుకొని ఉన్న దానికి ఆనుకుని ఉన్న 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో గ్రీన్ లంగ్స్‌గా పని చేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో-డిశ్చార్జ్ ఉండేలా పర్యావరణ హిత నగరంగా ఉండే కార్యక్రమాలను ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో అమలు చేస్తుంది.
'లైవ్, లెర్న్, వర్క్, ప్లే' (Live, Learn, Work, Play) కాన్సెప్ట్ తో ఈ సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్‌లో ఉంటాయి. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్-బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్ ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు), ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యమివ్వటం రాబోయే శతాబ్దపు సిటీకి కొత్త సంకేతం. స్మార్ట్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్-జనరేషన్ టెక్నాలజీకి ఫ్యూచర్ సిటీ సరికొత్త నమూనాగా ఉండనుంది.
సింగిల్ విండో క్లియరెన్స్
ఈ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా 'సింగిల్ విండో సిస్టమ్' అమలు చేస్తారు. FCDA కార్యాలయంలోనే భవన నిర్మాణం, లే అవుట్లు, పారిశ్రామిక అనుమతులు వంటి అన్ని రకాల క్లియరెన్స్లు ఒకేచోట లభిస్తాయి. సుపరిపాలన దిశగా ఇది సరికొత్త మార్పు. దీంతో ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులకు తరలిరానున్నాయి. ఫ్యూచర్ సిటీలోని మీర్ఖాన్పేటలో 7,29 ఎకరాల స్థలాన్ని ఎఫ్సీడీఏ కు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్షంలో నిర్మిస్తున్న ఎఫ్సీడీఏ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం భూమి పూజ చేస్తారు.
ట్రాఫిక్ జామ్‌లకు చెక్: సూపర్-ఫాస్ట్ కనెక్టివిటీ
మహానగరాలకు అత్యంత ముఖ్యమైనది ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ. ఈ దిశగా భారత్ ఫ్యూచర్ సిటీలో అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR)లను కలుపుతూ వంద మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మించనుంది. రావిర్యాల నుంచి అమనగల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నెం.1కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు.
రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలను కలిపే కొత్త ఈస్ట్-వెస్ట్ ట్రంక్ రోడ్డు నిర్మిస్తారు. టోల్ ఫీజు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్-ఫ్లో మార్గాలను ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మెట్రో ఫేజ్ 2–బి కి అనుసంధానం చేస్తారు.









