)
Telangana Govt Teachers: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించక వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్లపై మరో పిడుగులాంటి వార్త వేసింది. క్రమశిక్షణ చర్యల పేరిట తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. నెల రోజులు విధులకు గైర్హాజరైతే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం ఉండదని తెలుస్తోంది. అనుమతి లేకుండా సెలవు పెడితే కఠిన నిర్ణయం తప్పదని హెచ్చరించింది.
ముందస్తు సమాచారం లేకుండా.. అధికారికంగా సెలవుపత్రం ఇవ్వకుండా డుమ్మా కొడితే ఆ టీచర్లను తొలగిస్తామని విద్యా శాఖ సంచలన నిర్ణయం ప్రకటించింది. విధులకు నెల రోజులపాటు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ టీచర్ల హాజరు విధానంపై సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సమీక్ష చేశారు. ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్), మధ్యాహ్న భోజనం అమలు వంటి వాటిపై డీఈఓలతో సమీక్షించిన ఆయన ఉపాధ్యాయుల హాజరు శాతంపై చర్చించారు.
అనధికారిక గైర్హాజరు చేసే ఉపాధ్యాయులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై డీఈఓలతో కమిషనర్ చర్చించారు. ఉపాధ్యాయుల హాజరుపై తరచూ సమీక్షించాలని ఆదేశించారు. నెలరోజులపాటు అనుమతి లేకుండా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని.. విచారణ చేసి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గెజిట్ ప్రచురించాలని డీఈఓలకు సంచలన ఆదేశాలు ఇచ్చారు. ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకోవాలని కమిషనర్ నిర్ణయించారు. ఉపాధ్యాయుల హాజరుతోపాటు ఆలస్యంపై కూడా దృష్టి సారించాలని చెప్పారు.
రెండేళ్లలో 50 మంది తొలగింపు
ప్రభుత్వ ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సెలవులు తీసుకుంటే ఉద్యోగం పోయినట్టే. దానికి రెండేళ్లలో ఉద్యోగాలు తొలగించిన జాబితా చూస్తే తెలిసిపోతోంది. ఆరు నెలల సెలవుకు అనుమతి తీసుకొని ఏడాది, రెండేళ్లైనా విధులకు రాని టీచర్లను రెండేళ్లలో ప్రభుత్వం తొలగించింది. ఇలా సుమారు 50 మంది టీచర్లను ఉద్యోగం నుంచి తొలగించినట్లు విద్యాశాఖ తెలిపింది.
టీచర్లు ఎంత మంది?
రాష్ట్రంలోని 24 వేల పాఠశాలల్లో సుమారు 1.15 లక్షల మంది టీచర్లు బోధన
6,100 మంది ఇతర పాఠశాలలు, విద్యాశాఖలోని ఇతర విభాగాల్లో డిప్యుటేషన్లపై విధి నిర్వహణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook