)
KCR Kaleshwaram Commission: దురుద్దేశపూర్వకంగా ఏర్పాటుచేశారని ఆరోపిస్తున్న కాళేశ్వరం కమిషన్ ముందు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్ కూలడంపై ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కొన్ని నెలల కిందట మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు స్పందించిన కేసీఆర్ విచారణకు హాజరు కానుండడం తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతోంది. దీంతో రేపు బుధవారం ఏం జరగనుంది అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
షెడ్యూల్ ఇదే!
కాళేశ్వరం కమిషన్ విచారణకు రేపు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు కమిషన్ ఎదుట ఆయన హాజరవుతారు. విచారణకు హాజరు కాబోతున్న కేసీఆర్‌ను ఎలాంటి ప్రశ్నలు అడగాలనే దానిపై కమిషన్ పూర్తిగా సిద్ధమైనట్లు సమాచారం. కమిషన్ కేసీఆర్‌పై ఎలాంటి ప్రశ్నలను సంధించబోతుందనేది ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు? విచారణ అనంతరం కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ రేపు జరగనున్న విచారణకు అక్కడి నుంచే నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉన్న బీఆర్కే భవన్‌కు వెళతారు. విచారణ అనంతరం హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న నివాసంలో భోజనం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రానికి ఎర్రవల్లికి వెళ్తారని తెలుస్తోంది.
మరోవైపు విచారణకు ఎదురుకోవడానికి సిద్ధమేనంటున్న బీఆర్ఎస్ పార్టీ దీన్ని బల ప్రదర్శనకు వేదికగా వాడుకునేందుకు ప్రణాళిక వేసుకుంది. కేసీఆర్‌కు భారీ స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు గులాబీ పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. దాదాపుగా 500 కార్లతో భారీ కాన్వాయ్‌తో కేసీఆర్ ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ నుంచి బయలుదేరనున్నారని సమాచారం. దారి పొడుగున ఆయనకు మద్దతు పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
విచారణలో మార్పులు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకానుండడంతో కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓపెన్ కోర్ట్ కాకుండా ఇన్ కెమెరా విచారణ చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజల తాకిడి ఉండడంతో ఇన్ కెమెరా విచారణ చేసే అవకాశం లేకపోలేదు. బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరు కాకుండా ఇన్ కెమెరా ముందే కమిషన్ విచారణలో కేసీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం.
వారిని ఓపెన్ కోర్టులోనే
ఇప్పటి వరకు కమిషన్ ముందు పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి హరీశ్ రావును ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారించింది. కేసీఆర్‌ను మాత్రం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇన్ కెమెరా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించింది. రేపు కమిషన్ ముందు 115 సాక్షిగా కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ విచారణ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ విచారణను కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook