)
Kaleshwaram Enquiry Latest Updates: కాళేశ్వరం కమిషన్ విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవలపై విచారణ కమిషన్ ముందు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈనెల 6వ తేదీన విచారణకు హాజరైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ను గంటన్నర పాటు విచారించింది పీసీ ఘోష్ కమిషన్. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గత కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాల ప్రకారమే మేరకే నిర్మాణంపై ముందుకు సాగామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అయితే అప్పట్లో కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈటెల కామెంట్స్‌పై మండిపడ్డారు. అంతేకాకుండా ఇప్పుడాయన కొత్త వాదనను తెరమీదకు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు కాళేశ్వరం కమిషన్‌కు ఈటల రాజేందర్ అసత్యాలతో కూడిన వాగ్మూలం ఇచ్చారని ఆరోపించారు మంత్రి తుమ్మల. కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పారన్నారు. ఈటల ప్రస్తావించిన సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధమే లేదని చెప్పడం చర్చనీయాశంగా మారింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదమే లేదని మంత్రి తుమ్మల బాంబ్ పేల్చారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కేళేశ్వరం ప్రాజెక్టు అంశం కేబినెట్ ముందుకు రాలేదని, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో మాత్రమే కాళేశ్వర పనులు జరిగాయని తెలిపారు. ఇన్నాళ్లు లేని కొత్త అంశాన్ని మంత్రి తుమ్మల కొత్తగా తెరమీదకు తెచ్చారు. అంతేకాదు త్వరలోనే తాను సుమోటాగా కమిషన్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. అయితే ఈ సబ్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదని మంత్రి తుమ్మల చెబుతున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మంత్రివర్గం దగ్గరకు రాలేదని.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో మాత్రమే పనులు జరిగాయని తుమ్మల బాంబ్ పేల్చడం చూస్తుంటే.. ఇష్యూ కొత్త మలుపు తిరిగినట్లే కనిపిస్తోంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మూడేళ్ల తర్వాత సవరించిన అంచనాలు మాత్రమే మంత్రివర్గం ముందుకు వచ్చాయని చెబుతున్నారు. అంతేకాదు అప్పట్లో కేబినెట్ సబ్ కమిటీ తసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీవోలు, రిపోర్టులన్నీ తన వద్ద ఉన్నాయని తెలిపారు. త్వరలోనే తానే కమిషన్ ముందు హాజరై పూర్తి సమాచారం అందజేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీమంత్రి హరీశ్ రావు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హరీశ్ రావును జస్టిస్ పీసీ ఘోష్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రశ్నించారు. మొత్తం 20 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు కమిషన్ అడిగినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అప్రువల్ ఉందని హరీశ్ రావు చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపైనే కంఫ్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ను సైతం కమిషన్ దాదాపు 50 నిమిషాలు విచారించింది. మొత్త 18 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. కేసీఆర్ కూడా కేబినెట్ ఆమోదం మేరకే నిర్ణయం జరిగినట్లు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంమీద త్వరలోనే కమిషన్ ముందుకు రాబోతున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. తన వద్ద ఉన్న కీలక వివరాలు విచారణ కమిషన్ ముందు సమర్పించబోతున్నట్టు తెలిపారు. అయితే వాటి ఆధారంగా కమిషన్ ఏమీ చేయబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ మారింది. మరోవైపు ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెర్షన్ కూడా కమిషన్ తెలుసుకునే అవకాశం ఉందట. మొత్తంగా తుమ్మల ఇచ్చే నివేదిక ఆధారంగా విచారణ కోణం పూర్తిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి కమిషన్ విచారణ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..