)
BJP Leader Death: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ మండల అధ్యక్షుడు యేట మధుకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేమనపల్లి మండల కాంగ్రెస్ నాయకులు వేధింపులు భరించలేక చనిపోతున్నట్లు ఆయన సూసైడ్ నోట్ రాశారు. తన చావుకి కారణం రుద్రభట్ల సంతోష్, గాలి మధు తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ లేఖలో పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసు పెట్టించి తన పరువు ప్రతిష్టమ దెబ్బతీశారని లేఖలో రాశారు. తన చావుకు కారణం అయిన సంతోష్, మధులపై పోలీసులు కేసు నమోదు చేయాలని.. తన కుటుంబాన్ని బీజేపీ ఆదుకోవాలని కోరారు.
తాను ఏ తప్పు చేయలేదని.. తనది అలాంటి క్యారెక్టర్ కాదని మధుకర్ సూసైడ్ నోట్లో రాశారు. అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పాలని వేమనపల్లి మండల ప్రజలను కోరారు. ఆయన సూసైడ్ రాసి.. నీల్వాయిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధుకర్ మరణంపై బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ట్విట్టర్లో స్పందించారు.
"వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ అనుమానాస్పద మృతి పట్ల నా గాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పార్టీ కోసం నిస్వార్థంగా పోరాడిన ధైర్యవంతుడు మధుకర్, కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం, అక్రమ కేసులు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు కారణంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష కార్యకర్తలపై ఇలాంటి దమనకాండకు స్థానం లేదు. రాష్ట్రంలో చట్టం కాపాడాల్సిన పోలీసులు, కాంగ్రెస్ నాయకుల చేతిలో బానిసలుగా మారారు. మధుకర్ మరణంపై ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం చెప్పలేకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనం.
మధుకర్ గారి మృతి ఆత్మహత్యా..? హత్యా..? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దౌర్జన్యాలను ప్రజలు ఖండించాలి. కాంగ్రెస్ పాలనలో బతకడం కూడా సవాల్‌గా మారింది!" అని ట్వీట్లో పేర్కొన్నారు.
పార్టీ కోసం నిరంతరం పోరాడిన మధుకర్ రాజకీయ కక్షలకు బలయ్యారని బీజేపీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాన్ని ప్రజలు ఖండించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పెట్టిన అక్రమ కేసు వలన అవమానం భరించలేక మధుకర్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. మధుకర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కఠిన పరిస్థితుల్లో వారి కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలని ప్రార్థిస్తున్నారు.