Telangana Politics: బీజేపీ నాయకులకు కొత్త టెన్షన్.. అప్పుడే ఎందుకు ఈ హైరానా..?

`Telangana Politics: తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త టెన్షన్‌ పట్టుకుందా..! వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతోందా..! 2028 ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ- జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రచారం సాగుతోంది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా..! ఇదే జరిగితే.. బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తప్పదని అంటున్నారా..! 

Written by - G Shekhar | Last Updated : Mar 25, 2025, 05:34 PM IST
Telangana Politics: బీజేపీ నాయకులకు కొత్త టెన్షన్.. అప్పుడే ఎందుకు ఈ హైరానా..?

Telangana Politics: తెలంగాణలో ఎన్డీయే యాక్టివ్‌ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఎన్డీయే పార్టీలు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే.. ఎన్డీయే మిత్రపక్షాలైన జనసేన- టీడీపీ పార్టీల సేవలను వాడుకోవాలని కాషాయ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఈ ఫార్ములా ఏపీలో సక్సెస్‌ కావడంతో.. తెలంగాణలోనూ అమలు చేయాలని లెక్కలు వేసుకుంటున్నారట. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో కాషాయ పార్టీ బలంగా ఉంది. కానీ దక్షిణ తెలంగాణలో మాత్రం పార్టీ కాస్త బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనను బరిలో దింపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఈ కలయికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఈ ప్రయోగం విఫలమైందని కాషాయ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలన్నీ జట్టుకట్టాయి. టీడీపీ- బీజేపీ- జనసేన పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ ఇదే ఫార్ములాను అమలు చేసే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారట. ఇదే విషయమై రాష్ట్ర బీజేపీ నేతలు తెగ టెన్షన్‌ పడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ లో కూటమి అనే ఆలోచనే సరైంది కాదని అంటున్నారట. ఇది జరిగితే మాత్రం మరోసారి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినట్లవుతుందని అంటున్నారట. గతంలోనూ ఇదే మిస్టేక్ చేశామని పార్టీ పెద్దలతో చెప్పారట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయకుండా మహాకూటమిగా బరిలో దిగింది. బీజేపీ కూటమిగా పోటీ చేయడం వలన హైదరాబాద్‌లో బాగా ప్లస్‌ అవుతుందని నేతలంతా లెక్కలు వేసుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో హైదరాబాద్‌లో రాజాసింగ్ ఒక్కరు మాత్రమే గెలిచారు.. మిగతా నేతలంతా ఓటమి పాలయ్యారు. అటు జిల్లాల్లోనూ బీజేపీకి కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు.. అప్పటివరకు కేసీఆర్‌ మీద కొంత వ్యతిరేకంగా ఉన్న తెలంగాణ సమాజం.. ఏపీ నుంచి చంద్రబాబు వచ్చేసరికి.. ఓటర్లంతా కేసీఆరే బెటరని ఆలోచనకు వచ్చారు. అందుకే గంపగుత్తగా మరోసారి కేసీఆర్‌కే పట్టం కట్టారని చెబుతారు.. 
 
ఆ ఎన్నికల్లో చంద్రబాబును ఓ అస్త్రంలా వాడుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్‌. చంద్రబాబు మరోసారి తెలంగాణపై కుట్రలు చేస్తున్నారంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే అప్పటివరకు బీజేపీపై కాస్తా సానుకూలంగా ఉన్న ఓటర్లు.. చంద్రబాబు రావడంతో.. కేసీఆర్‌ వైపు మొగ్గుచూపారు. దాంతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అప్పట్లో అధికారం చేతుల్లోకి వస్తుందని భావించినా బీజేపీకి చంద్రబాబు రూపంలో గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి.. ఈ అనుభవం నుంచి తెలంగాణ బీజేపీ నేతలు గుణపాఠం నేర్చుకున్నారు. ఆ తర్వాత తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ ఒంటిరిగా పోటీ చేసి ఎనిమిది చోట్ల ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గ్రాండ్‌ విక్టరీ కొట్టారు. కానీ ఇప్పుడు మళ్లీ కూటమి అని పార్టీ పెద్దలు ప్రతిపాదన తేవడంతో నేతలంతా ఉలిక్కిపడ్డట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఉత్తర తెలంగాణ వారే. కేవలం గ్రేటర్‌ హైదరాబాద్ నుంచి రాజాసింగ్ ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. మిగతా లీడర్లంతా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో చూపించిన ప్రభావం దక్షిణ తెలంగాణలో కమలం పార్టీ చూపించలేకపోయింది. అయితే దక్షిణ తెలంగాణలో టీడీపీకి ఇంకా బలమైన కేడర్ ఉంది. అటు పవన్‌ కల్యాణ్‌కు బలమైన ఫ్యాన్ పాలోయింగ్‌ ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ సెటిలర్‌ ఓట్లు లక్షల్లో ఉన్నాయి. ఇవన్నీ గంపగుత్తగా బీజేపీకి పడుతాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఎన్డేయే పార్టీల పోటీ అనే ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికలకు మరో మూడున్నరేళ్లు సమయం ఉందని.. అప్పటి పరిస్థితుల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుందామని తెలంగాణ బీజేపీ నేతలతో చెప్పినట్టు తెలుస్తోంది. చూడాలి మరి.. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే పార్టీలు బరిలో దిగితే.. తెలంగాణ ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో..!

Add Zee News as a Preferred Source

Also Read: Viral Video: కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఘోరం.. బీర్ సీసాతో పోలీసు తలపగల గొట్టిన బైక్ రేసర్.. వీడియో వైరల్.

Also Read: Teachers Posts: కేసీఆర్‌ హయాంలో 26 వేల టీచర్ల భర్తీ జరిగింది: కుండబద్దలు కొట్టి చెప్పిన హరీశ్‌ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News