
KTR fires on congress govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న కాంగ్రెస్ మంత్రులు, సీఎం కార్యాలయం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న ఆరోపణల పైన స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డారన్నారు. విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని తీవ్రంగా కేటీఆర్ విమర్శించారు.
గ్రూప్-1 పోస్టుల కోసం విడతల వారిగా డబ్బులు చేతులు మారాయని.. పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణల పైన ప్రభుత్వం స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్ వన్ అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నేరుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. తగిన విచారణ ఈ అంశంలో జరగాల్సిన అవసరం ఉంది అన్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశించినట్టుగా గ్రూప్-1 పరీక్షను మళ్లీ తాజాగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఒక జుడీషియల్ కమిషన్ వేసి.. ఉద్యోగాలను అమ్ముకున్న దొంగలెవరో తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇది నిరుద్యోగులకు న్యాయం చేకూర్చడమే కాకుండా.. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఆపుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇది నిరుద్యోగుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, కాసుల కక్కుర్తి కలిసి అనేక అవకతవకలకు కారణమయ్యాయని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతు కోసిందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఒక వ్యాపారంగా మార్చిందన్నారు. అందుకే కోట్లాది రూపాయలను తీసుకొని పోస్టులను అమ్ముకుందని కేటీఆర్ పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అవ్వడం వల్ల యువత నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, ఈ వైఫల్యాన్ని వారు ఎప్పటికీ క్షమించరని కేటీఆర్ అన్నారు.
అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించాలని, కేవలం మాటలతో కాకుండా చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook