కోటి ఆశలతో ఢిల్లీ బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ !!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారు

Last Updated : Oct 3, 2019, 05:21 PM IST
కోటి ఆశలతో ఢిల్లీ బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ !!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన..రేపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులను పెంచాలని కేంద్రాన్ని కోరనున్నారు సీఎం. అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిసింది.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో ముఖమంత్రి కేసీఆర్ భేటీకానున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు మోడీతో సమావేశం కాబోతున్నారు. కాగా ఈ భేటీలో విభజన బిల్లు ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులను పెంచాలని ఈ సందర్భంగా మోడీని కేసీఆర్ కోరనున్నారు. 

ఇదే సమయంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విన్నవించనున్నారు. విభజన హామీలను అమలు చేయాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. కాగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఆయన కేసీఆర్ తో భేటీ కానుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Trending News